2 May, 2026 | 2:25 AM

కార్మిక నాయకుడు యారం పిచ్చిరెడ్డికి ‘శ్రమశక్తి పురస్కారం’

02-05-2026 01:08 AM

మంత్రి వివేక్ చేతుల మీదుగా ప్రధానం!

కార్మికుల శ్రేయస్సు కోసం చేస్తున్న పోరాటానికి దక్కిన అరుదైన గుర్తింపు

బూర్గంపాడు, మే1 (విజయక్రాంతి): ప్రపంచ కార్మిక దినోత్సవం (మే డే) సందర్భంగా సారపాక ఐటీసీ పిఎస్పిడి ఐఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర కనీస వేతనాల మండలి సభ్యులు యారం పిచ్చిరెడ్డికి అత్యున్నత పురస్కారం వరించింది. కార్మిక వర్గం కోసం ఆయన చేస్తున్న నిరంతర సేవలను గుర్తిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు ప్రతిష్టాత్మకమైన శ్రమశక్తి పురస్కారం ప్రకటించింది. శుక్రవారం హైదరాబాద్లో జరిగిన అధికారిక వేడుకల్లో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గెడ్డం వివేక్ వెంకటస్వామి చేతుల మీదుగా పిచ్చి రెడ్డి ఈ పురస్కారాన్ని అందుకున్నారు.

దశాబ్దాలుగా ఐటీసీ కార్మికుల గొంతుకగా మారి, వారి సమస్యల పరిష్కారం కోసం యాజమాన్యంతో రాజీలేని పోరాటం చేస్తున్నందుకు గాను ప్రభుత్వం ఈ అవార్డుకు ఆయన్ని ఎంపిక చేసింది. ముఖ్యంగా వేతన ఒప్పందాలు, కార్మికుల సంక్షేమ పథకాల అమలులో ఆయన పోషిస్తున్న పాత్రతో ఈ అవార్డు అందుకున్నారు. పురస్కారం అందుకున్న అనంతరం అయన మాట్లాడుతూ.. ‘ఈ రోజు నా జీవితంలో అత్యంత గొప్ప క్షణం.

ఈ ’శ్రమ శక్తి అవార్డు’ కేవలం నాకు మాత్రమే కాదు, నాతో నడిచిన ప్రతి కార్మికుడికి దక్కిన గుర్తింపు. మీ అందరి సహకారంతోనే ఇది సాధ్యమైందని, నా ప్రాణం ఉన్నంత వరకు కార్మిక శ్రేయస్సు కోసమే పని చేస్తానని, నన్ను ఈ పురస్కారానికి ఎంపిక చేసిన తెలంగాణ ప్రభుత్వానికి, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్బంగా శ్రమశక్తి పురస్కారం అందుకున్న యారం పిచ్చి రెడ్డికి ఐఎన్టీయూసీ నాయకులు, ఐటీసీ కార్మికులు, రాజకీయ ప్రముఖులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలిపారు.