చిటికెడు కరుణ.. పిడికెడు కోపం!
వరుస బ్లాక్‌బస్టర్లతో దూసుకెళ్తున్న స్టార్ హీరో నాని తన తదుపరి ప్రాజెక్టును ప్రకటించారు. ఇటీవల పవన్‌కల్యాణ్ ‘ఓజీ’తో గుర్తింపు తెచ్చుకున్న సుజీత్ దర్శకత్వంలో నాని తొలిసారి నటించనున్నారు. యూనానిమస్ ప్రొడక్షన్స్, నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు ‘నాని34’గా ప్రచారంలో ఉందీ సినిమా. నాని పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఈ మూవీ టైటిల్‌ను అధికారికంగా ప్రకటించారు. ‘బ్లడీ రోమియో’ అనే పేరుతో రానున్నట్టు వెల్లడించారు. ఈ మేరకు మేకర్స్ విడుదల చేసిన కామిక్ -నోయిర్ టైటిల్ గ్లింప్స్ ఈ సినిమాపై అంచనాలు పెంచేసింది.
ఈ ప్రోమోలో హీరోను కిచెన్‌లో పరిచయం చేస్తారు. చిటికెడు కరుణ, పిడికెడు కోపం లాంటి పదార్థాలను వంటకంగా చూపిస్తూ, తన జీవితాన్ని ఓ మాస్టర్ చెఫ్‌లా ప్రజెంట్ చేశారు. ఆఖరలో నాని పాత్ర దేన్నీ లెక్క చేయని శక్తిలా బయటి రావడం అదిరిపోయింది. దర్శకుడు.. లండన్ నేపథ్యంలో రూపొందిస్తున్న ఈ సినిమా ద్వారా నేచురల్ స్టార్ ఇమేజ్‌ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని చూస్తున్నాడని తెలుస్తోంది. ఈ వేసవిలో షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలోనే తెలియజేస్తారు.
‘ప్యారడైజ్’ నుంచి ఆయా షేర్..
నాని హీరోగా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల రూపొందిస్తున్న చిత్రం ‘ది ప్యారడైజ్’. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో మోహన్‌బాబు, రాఘవ్ జుయాల్, సంపూర్ణేశ్‌బాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా విడుదలైన ఫస్ట్ సింగిల్ ‘ఆయా షేర్’ ప్రోమో వైరల్ కాగా, మంగళవారం నాని బర్త్‌డే కానుకగా ఈ సాంగ్ ఫుల్‌ట్రాక్‌ను విడుదల చేశారు మేకర్స్.
ఈ గీతాన్ని కాసర్ల శ్యామ్ రాయగా, అనిరుధ్ రవిచందర్ సంగీత సారథ్యంలో ప్రముఖ తెలంగాణ జానపద గాయకులు అడ్డుల జంగిరెడ్డి, ఆకునూరి దేవయ్య ఆలపించారు. ఆగస్టు 21న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ, బెంగాలీ, స్పానిష్, ఇంగ్లీష్ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రానికి డీవోపీ: సీహెచ్ సాయి; సంగీతం: అనిరుధ్ రవిచందర్; ఎడిటింగ్: నవీన్ నూలి; ప్రొడక్షన్ డిజైన్: అవినాష్ కొల్లా; రచన, దర్శకత్వం: శ్రీకాంత్ ఓదెల.




