సీవరేజ్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి
అధికారులను కోరిన మన్నె గోవర్ధన్ రెడ్డి
ఖైరతాబాద్, ఆగస్టు 22(విజయక్రాంతి): సీవరేజ్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని బీఆర్‌ఎస్ ఖైరతాబాద్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ ఇంచార్జి మన్నె గోవర్ధన్ రెడ్డి అధికారులను కోరారు. ఈ మేరకు జలమండలి జీఎం ప్రభాకర్ రావును శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలో నెలకొన్న పలు సీవరేజీ, నీటి సరఫరా సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ప్రధానంగా ప్రధానంగా ఖైరతాబాద్ ఆంధ్రగల్లీలో నూతన సీవరేజ్ పైప్లైన్ ఏర్పాటు చేయాలని కోరారు.
న్యూ సీఐబీ క్వార్టర్స్లో నూతన సీవరేజ్ పైప్లైన్ నిర్మించాలన్నారు. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో తాగునీటి సమస్య నెలకొందని వివరించారు, నీటి సరఫరాలో సమయపాలన లేని కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ప్రజలకు అనుగుణంగా నిర్ణీత సమయంలో నీటి సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారిని కోరారు. జలమండలి జీఎం ప్రభాకర్ రావు మాట్లాడుతూ తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను పరిశీలిస్తామన్నారు. వాటికి అనుగుణంగా ప్రణాళికలను రూపొందించి పరిష్కరిస్తామని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు గజ్జెల ఆనంద్, శ్రీనివాస్, శ్యామ్ గౌడ్, బాలు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.






