15 August, 2026 | 2:53 AM

తాగునీటికి శాశ్వత పరిష్కారం

15-08-2026 01:01 AM

108 గ్రామాలు, ఆవాసాల్లో మిషన్ భగీరథ పనులకు ప్రభుత్వం ఆమోదం

ములుగు, ఆగస్టు 14 (విజయ క్రాంతి) : త్రాగునీరు నోచుకొని ఆవాసాలకు శాశ్వత మంచినీటి పరిష్కారం కోసం ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ములుగు జిల్లాతో పాటు మహబూబాబాద్ జిల్లాలోని కొత్తగూడెం, గంగారం మండలాలతో కలిపి 108 గ్రామాలు, ఆవాసాల్లో తాగునీటి సౌకర్యాలను మెరుగుపరిచేందుకు మిషన్ భగీరథ పథకం కింద 20 కోట్ల 96 లక్షల 49 వేలతో చేపట్టనున్న పనులకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ జీవో నెం.428ను విడుదల చేసింది. గ్రామాల్లో అదనపు, ప్రత్యామ్నాయ తాగునీటి సౌకర్యాల కల్పనలో భాగంగా ఓవర్హెడ్ సర్వీస్ రిజర్వాయర్లు, పైప్లైన్లు, బోర్వెల్లు తదితర మౌలిక సదుపాయాల నిర్మాణ పనులు చేపట్టనున్నారు.

పనులు ప్రారంభించే ముందు భూగర్భ జలాల లభ్యతపై సమగ్ర సర్వే నిర్వహించాలని, సాంకేతిక ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వం ఆదేశించింది. అలాగే గ్రామ పంచాయతీలతో సమన్వయం చేసుకుంటూ పనులను నాణ్యతతో, సకాలంలో పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించింది. మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికీ సురక్షితమైన తాగునీటిని అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిధులను మంజూరు చేసింది.