అందరికీ న్యాయం జరిగేలా పర్సంటేజీ
ఛాంబర్ నిర్ణయాన్ని ఎగ్జిబిటర్లు వ్యతిరేకించడం తగదు
జూన్ 30 వరకల్లా పర్సంటేజీ విధానంపై తుది నిర్ణయం
అందరికీ న్యాయం జరిగేలా నావంతు కృషి చేస్తా
నిర్మాతలు, ఎగ్జిబిటర్లకు చిరంజీవి సూచనలు
సింగిల్ స్క్రీన్లకు పర్సంటేజ్ విషయమై ప్రస్తుతం టాలీవుడ్‌లో నెలకొన్న సంక్షోభాన్ని తొలగించే దిశగా మార్గం సుగమం అవుతోంది. ఇందులోభాగంగా సోమవారం అగ్ర కథానాయ కుడు చిరంజీవిని పలువురు పరిశ్రమ పెద్దలు కలిశారు. పర్సంటేజీ అంశంతో పాటు పలు సమస్యలను ఈ సందర్భంగా వారు మెగాస్టార్ దృష్టికి తీసుకొచ్చారు.
విషయాలన్నీ పూర్తిగా విన్న చిరంజీవి పరిశ్రమలో భాగస్వాములైన అందరికీ పూర్తి న్యాయం జరిగేలా నిర్ణయాలు ఉండాలని సూచించారు. ఒక్క సినిమా గురించో, ఒక్క సెక్టార్ గురించో చర్చ జరగడం సరికాదన్నారు. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి వుండటం అందరికీ సముచితమన్నారు. ఒకసారి అందరినీ సంప్రదించి, పర్సంటేజ్ విధానంపై ఒక కమిటీని ఏర్పాటు చేస్తూ ఛాంబర్ ఒక నిర్ణయాన్ని తీసుకున్న తర్వాత దాన్ని వ్యతిరేకిస్తూ మీడియా ముందు ఏ ఒక్కరూ అభిప్రాయాలు వ్యక్తపరచటం తగదంటూ ఆయన తెలంగాణ ఎగ్జిబిట ర్స్‌ను ఉద్దేశించి పరోక్షంగా అన్నారు.
ఇలాంటివాటివల్ల ఇండస్ట్రీ ఒక్కటిగా లేదన్న సందేశం ఇవ్వకూడదంటూ చిరంజీవి.. ఈ సందర్భంగా తెలంగాణ ఎగ్జిబిటర్ల తీరును తప్పుబట్టారు. ఇంతకు ముందు వేసిన వేరే కమిటీల పనితీరు, ఫలితాల పట్ల సింగిల్ స్క్రీన్స్ సభ్యుల్లో కొంత అసంతృప్తి, అపనమ్మకం వుందన్న విషయం అర్థమైందన్నారు. ఈసారి ఛాంబర్ ఏర్పాటుచేసిన కమిటీ అనుకున్న గడువులో అంటే.. జూన్ 30వ తేదీ వరకూ, అన్ని విషయాలను పూర్తిగా పరిశీలించి ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు అందరికీ న్యాయం జరిగేలా పర్సంటేజ్ విధానంపై ప్రతిపాదనని చేస్తుందని తనకు నమ్మకం ఉందని చెప్పారు.
ఆ కమిటీ సకాలంలో తన బాధ్యతలు పూర్తిచేసి నివేదిక ఇవ్వటానికి తనవంతు కూడా పూర్తి ప్రయత్నం చేస్తానని చిరం జీవి హామీ ఇచ్చారు. తెలంగాణ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు శేఖర్, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు సురేశ్‌బాబు, నిర్మాతలు అల్లు అరవింద్, సునీల్ నారంగ్, భరత్ నారంగ్, కేఎల్ నారాయణ, అనుపమ్, శ్రీధర్, సదానంద్‌గౌడ్, సుదర్శన్ థియేటర్ ప్రొప్రైటర్ రాజ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
రెండు రోజుల్లో పరిష్కారం: దిల్ రాజు
చిరంజీవితో సమావేశం అనంతరం దిల్ రాజు మీడియాతో మాట్లాడుతూ.. “పర్సంటేజీ విధానంపై ఎగ్జిబిటర్లు అన్ని విషయాలను చిరంజీవికి వివరించారు. ఆయన సానుకూలంగా విన్నారు. వారం కిందట ఛాంబర్ ఏర్పాటుచేసిన కమిటీ నుంచి మరిన్ని వివరాలు తెప్పించుకొని పరిశీలిస్తానన్నారు. రెండు రోజుల్లో ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది” అన్నారు. తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ కార్యదర్శి శ్రీధర్ మాట్లా డుతూ.. ‘ఎగ్జిబిటర్లు, సింగిల్ స్క్రీన్ల సమస్యలను చిరంజీవి దృష్టికి తీసుకెళ్లాం. ఇన్ని ఇబ్బందులు ఉన్నాయా.. అంటూ ఆయన ఆశ్చర్యపోయారు. సబ్ కమిటీని కూడా పిలిపించుకొని మాట్లాతానని చెప్పారు.






