31 March, 2026 | 1:48 AM

గుర్తుండిపోయే లవ్ స్టోరీ

31-03-2026 12:09 AM

హీరో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా నటిస్తున్న కొత్త సినిమా ‘చెన్నై లవ్ స్టోరీ’. సాయి రాజేశ్ కథను అందిస్తున్న ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్‌కేఎన్, సాయిరాజేశ్ నిర్మిస్తున్నారు. మణి శర్మ సంగీత సారథ్యం వహిస్తున్న ఈ సినిమా నుంచి ‘గుర్తుందా’ అనే పాటను చిత్రబృందం సోమవారం విడుదల చేసింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన గీతావిష్కరణ కార్యక్రమంలో హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. “మా మూవీ రిలీజ్ అయిన రోజు థియేటర్లలో మ్యూజిక్ కన్సర్ట్ అయినట్లు ఉంటుంది.

ఇండియన్ సినిమా గ్రేటెస్ట్ లవ్‌స్టోరీస్‌లో ఒకటిగా ‘చెన్నై లవ్ స్టోరీ’ ఎప్పటికీ గుర్తుండిపోతుంది” అన్నారు. ‘గ్లింప్స్ రిలీజైనప్పటి నుంచి ఈ మూవీ మీద చాలా అంచనాలు ఏర్పడుతు న్నాయ’ని హీరోయిన్ శ్రీగౌరి ప్రియ తెలిపింది. దర్శక నిర్మాత సాయిరాజేశ్ మాట్లాడుతూ.. “ఈ సినిమాను నేను అనుకున్నదాని కంటే బాగా తెరకెక్కించాడు రవి నంబూరి. ఈ సినిమా చూస్తూ కన్నీళ్లు ఆపుకోలేకపోయా. అతను ఎంత ప్రతిభావంతమైన దర్శకుడో తర్వాత మీరంతా చూస్తారు” అన్నారు.

డైరెక్టర్ రవి నంబూరి మాట్లాడుతూ.. “ఎమోషనల్ మూవీ చేయగలనా అనుకున్న నాతో ఇలాంటి మంచి మూవీ చేయిస్తూ నా ప్రతిభను వెలికితీస్తున్నారు. సాయి రాజేశ్‌లోని మ్యూజిక్ టేస్ట్ నేర్చుకునేందుకే ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తా అనుకున్నా” అని చెప్పారు. నిర్మాత ఎస్‌కేఎన్ మాట్లాడుతూ.. “నిర్మాతగా నేను సినిమాలు చేసేందుకు ఎప్పుడూ తొందరపడలేదు. నా మనసుకు నచ్చిన కథ దొరికినప్పుడే సినిమాలు నిర్మించా.

ప్రేక్షకుల డబ్బుకు రెట్టింపు మనసును హత్తుకునే మూవీ అవుతుంది. మా సినిమాను జూన్ 26 అనుకున్నాం. కానీ, ఆ తేదీన రామ్‌చరణ్ పెద్ది సినిమా వస్తోంది. మా సినిమా రిలీజ్ డేట్‌ను త్వరలో ప్రకటిస్తాం” అని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ, నిర్మాత ధీరజ్ మొగిలినేని, చిత్రబృందం కూడా మాట్లాడారు.