31 March, 2026 | 1:51 AM

సంగీత రంగంలో కార్మేని సెల్వం కొత్త ఒరవడి

31-03-2026 12:11 AM

పాత్వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో  రూపొందిన ద్విభాషా చిత్రం ‘కార్మేని సెల్వం’. సముద్రఖని ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రంలో గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. మ్యూజిక్ యాజ్ ఏ సర్వీస్ అంటూ మ్యూజిక్ క్లౌడ్ స్టూడియో అండ్ టెక్నాలజీ పేరుతో రామానుజన్ ఎంకే తమ సంస్థ ద్వారా ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతాన్ని అందించారు.

ఏప్రిల్ 3న తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం థియేట్రికల్ రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా సంగీతం దర్శకుడు రామానుజన్ ఎంకే చిత్ర విశేషాలను వివరించారు. “ఒక చిత్రానికి సంగీతాన్ని అందించిన ఘనత ఏ ఒక్క వ్యక్తికీ కాకుండా, ఒక సంస్థకు దక్కాలని కోరుకున్నాం. అందుకే 2017లో బెంగళూరులో ‘మ్యూజిక్ క్లౌడ్ స్టూడియో అండ్ టెక్నాలజీ’ని ప్రారంభించా. సౌండ్ డిజైన్, వాయిస్ ఓవర్లు, డబ్బింగ్ వంటి అన్ని సేవలను అందించాం.

‘కార్మేని సెల్వం’ సినిమాకు సంగీతం దర్శకుడి పేరు కాకుండా.. (మ్యూజిక్ యాజ్ ఏ సర్వీస్) మ్యూజిక్ క్లౌడ్ స్టూడియో అండ్ టెక్నాలజీ పేరును ప్రకటించాం. సినిమా వ్యయాన్ని తప్పనిసరిగా తగ్గించే  క్రమంలో సంగీతం సమకూర్చడానికి అయ్యే ఖర్చును తగ్గించాలనుకుని ఈ చిత్రం విషయంలో ఇలా ప్లాన్ చేశాం.

సినీ సంగీత రంగంలో ఇదొక కొత్త ప్రభంజనం అనుకోవచ్చు. సంగీతం ఎప్పుడూ ఒక వ్యక్తి పని కాదు అది టీమ్ వర్క్. మంచి కథలు, మంచి సినిమాల్లో భాగం కావడం నా లక్ష్యం. తెలుగులో ‘హ్యాపీ డేస్’, ‘ఆనంద్’, ‘గోదావరి’ లాంటి ఫీల్-గుడ్ సినిమాలకు మ్యూజిక్ చేయాలని ఉంది. నా పేరు కంటే నా సంగీతమే ప్రేక్షకుల హృదయాల్లో నిలవాలని కోరుకుంటున్నా” అని తెలిపారు.