calender_icon.png 6 February, 2026 | 10:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చిట్టీల పేరుతో ఘరానా మోసం

06-02-2026 12:30:55 AM

  1. రూ.2 కోట్లతో నిర్వాహకుల జంప్!
  2. వారిని కలువొద్దు, బెదిరించొద్దంటూ బాధితులకు కోర్టు నోటీసులు 
  3. పోలీస్ స్టేషన్‌లో బాధితుల ఫిర్యాదు
  4. రంగారెడ్డి జిల్లా ఆమనగల్లులో ఘటన

ఆమనగల్లు, ఫిబ్రవరి 5 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా అమనగల్ మండలంలో చిట్టీల పేరుతో దంపతులిద్దరు ప్రజల నుంచి సుమారు రూ.2 కోట్లకు పైగా వసూలు చేసి, పరారైన ఘటన  వెలుగులోకి వచ్చింది. కడ్తాల్ మండలం ఎక్వాయిపల్లి గ్రామానికి చెందిన లకుమారపు లావణ్య, లక్ష్మీనారాయణ దంపతులు. ఆమనగల్ మండల కేంద్రంలోని ఆదర్శ కాలనీలో గత కొంతకాలంగా నివాసం ఉంటున్నారు.

లావణ్య స్థానికులతో పరిచయాలు ఏర్పాటు చేసుకుని చిట్టీల వ్యాపారం నిర్వహిస్తున్నది. కాలనీలో ఉండే వారితో పాటు కిట్టి పార్టీ గ్రూపు సభ్యులు, బంధుమిత్రులు, ఉద్యోగులు, చిరు వ్యాపారులు, పెన్షనర్ల నుంచి నమ్మకంగా డబ్బులు వసూలు చేసింది. అయితే, చిట్టీ కాలపరిమితి ముగిసినా, పాట పాడుకున్న వారికి డబ్బులు ఇవ్వకుండా వారికి అధిక వడ్డీ ఆశ చూపుతూ వాయిదాలు వేస్తూ  వచ్చింది.

ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం ఇంటికి తాళం వేసి, ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి దంపతులిద్దరూ పరారు కావడంతో బాధితులు తాము మోసపోయామని గ్రహించారు. అయితే బాధితులకు కోర్టు ద్వారా అడ్వకేట్ నాగేశ్వర్ నుంచి  దివాలా నోటీసులు వచ్చాయి. తన క్లయింటు లావణ్యను ఎవరైనా వ్యక్తిగతంగా కలిసినా, బెదిరించినా వారిపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని కోర్టు నోటీసులో హెచ్చరించారు.

దీంతో బాధితులు గురువారం ఆమనగల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పలువురు బాధితులు పోలీస్ స్టేషన్ ఎదుట తమ బాధను వెలిబుచ్చారు. బిడ్డ పెళ్లికి, కొత్త ఇంటి నిర్మాణానికి, బిడ్డల పైచదువుల కోసం చిట్టీలు వేస్తే మోసం చేయడం ఎంతవరకు సబబు అని, ఇలాంటి నేరగాల పట్ల పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చిట్టీల విలువ మొత్తం రూ.2 కోట్ల వరకు ఉండవచ్చని బాధితులు  పేర్కొన్నారు.