పూరి గుడిసెల్లో ఉండే ప్రతి పేదకు సొంతిల్లు
మారుమూల గ్రామాలకూ బీటీ రోడ్లు: మంత్రి పొంగులేటి
బూర్గంపాడు,జూలై 19,(విజయక్రాంతి): రాష్ట్రంలో పూరి గుడిసెల్లో నివసిస్తున్న ప్రతి నిరుపేద కుటుంబానికి సొంతింటి కలను సాకారం చేయడమే ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. మారుమూల గ్రామాలకు సైతం బీటీ రోడ్ల నిర్మాణం చేపట్టి గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు.ఆదివారం బూర్గంపాడు మండలం మోరంపల్లి బంజర గ్రామంలో ఆవుల రమణ ఇందిరమ్మ గృహాన్ని మంత్రి ప్రారంభించారు.
అనంతరం పినపాక పట్టినగర్ నుంచి ఉప్పుసాకకు వెళ్లే మార్గంలో రూ.2.20 కోట్ల వ్యయంతో నిర్మించనున్న బీటీ రోడ్డుకు పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఐటీడీఏ పీవో బి. రాహుల్, సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్టతో కలిసి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... పినపాక నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన నిధులు ప్రభుత్వం సమకూరుస్తోందన్నారు.
మొదటి విడతలో 4,500 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామని, రెండో విడతలో మరో 2,000 ఇళ్లకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. బూర్గంపాడు మండలానికి మంజూరైన 675 ఇళ్లలో ఇప్పటికే 325 ఇళ్లు పూర్తయ్యాయని చెప్పారు.రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, రెండు పంటలకు రైతు భరోసా అందిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.
సీతారామ కాలువల ద్వారా దోమలవాగు చెరువుకు నీటిని విడుదల చేసి రైతులు రెండు పంటలు సాగు చేసుకునేలా చర్యలు తీసుకున్నామని, భవిష్యత్తులో దోమలవాగు చెరువును మినీ రిజర్వాయర్గా అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు.
కార్యక్రమంలో డీఆర్డీఓ విద్యాచందన, ఎంపీడీవో జమలారెడ్డి, హౌసింగ్ పీడీ శంకర్, సర్పంచులు బొర్ర సుభద్ర, బానోత్ పద్మ, ఉపసర్పంచ్ పొక్కుల రవి, మాజీ సొసైటీ చైర్మన్ పోతిరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి,మాజీ ఉప సర్పంచ్ లక్ష్మీనారాయణ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు,వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.






