14-02-2026 12:25:56 AM
కరీంనగర్, ఫిబ్రవరి 13 (విజయక్రాంతి): ధర్మపురి మున్సిపల్ ఎన్నికల ఫలితాలు తెలంగాణ రాజ కీయాల్లో కొత్త అధ్యాయానికి నాంది పలికాయి. రాష్ట్ర స్థాయిలో విస్తృత ప్రాధాన్యం సంతరించుకున్న ఈ ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించి, మొత్తం 15 వార్డులను క్లీన్‌స్వీప్ చేసింది. మరోవైపు బీఆర్‌ఎస్ పార్టీకి ఇది ఊహించని ఘోర పరాభవంగా మారింది.
ఒకప్పుడు కంచుకోటగా భావించిన ధర్మపురిలో కాంగ్రెస్ విజయం సాధించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు కొప్పుల ఈశ్వర్ ఎన్నో విమర్శలు చేసినప్పటికీ, ప్రజలు మాత్రం ధర్మం, --న్యాయం వైపు నిలిచారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వం లో సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు ధర్మపురి ప్రజల మనసు గెలుచుకున్నాయి.
ఇంటింటికీ చేరిన సంక్షేమం, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సహాయం అందించడం వల్ల కాంగ్రెస్‌పై ప్రజలకు విశ్వాసం మరింత బలపడిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పాలనకు ఈ ఫలితాలు అద్దం పట్టాయి. ఈ సారి ప్రజలు “వాగ్దానాలు కాదు -- అమలు కావాలి” అనే భావనతో, సంక్షేమ పథకాలు నేరుగా తమ జీవితాలను తాకాయని భావించి కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు.
ప్రతి హామీని నెరవేర్చుతాం: అడ్లూరి
మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల్లో గడిచిన రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి, సంక్షేమానికి ప్రజలు పట్టం కట్టారని అన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పుతో రాత్రి పగలు కష్టపడి అభివృద్ధికి కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన ప్రతి హామీని ఆరు నెలల లోపు పూర్తి చేస్తామని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలు బుద్ధి తెచ్చుకోవాలని హితవు పలికారు.