డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం
గూడూరు (విజయక్రాంతి): యువతను మాదకద్రవ్యాల బారిన పడకుండా కాపాడుతూ డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించడమే లక్ష్యంగా మహబూబాబాద్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గూడూరు మండల కేంద్రంలో ‘మన ఊరు, మన బాధ్యత' కార్యక్రమంలో భాగంగా ‘2కే రన్ ఫర్ డ్రగ్స్ ఫ్రీ సొసైటీ’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ అవగాహన కార్యక్రమంలో స్థానిక పాఠశాలలు, కళాశాలలకు చెందిన 1,000 మందికి పైగా విద్యార్థులు, యువతీ యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ పి. జెండా ఊపి 2 కే రన్‌ను ప్రారంభించారు.. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. విద్యార్థి దశ ఎంతో విలువైనదని, యువత దురలవాట్లకు దూరంగా ఉంటూ తమ జీవిత లక్ష్యాలను సాధించేందుకు కష్టపడాలని సూచించారు.
డ్రగ్స్, గంజాయి వంటి మాదకద్రవ్యాలు శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపడంతో పాటు భవిష్యత్తును నాశనం చేస్తాయని హెచ్చరించారు. క్షణిక ఆనందం కోసం మాదకద్రవ్యాలకు అలవాటు పడితే జీవితాంతం తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. జిల్లాలో ఎక్కడైనా గంజాయి సాగు, రవాణా, విక్రయాలకు సంబంధించిన సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని కోరారు. సమాచారం అందించిన వారికి రూ.5,000 వరకు నగదు బహుమతి అందజేస్తామని తెలిపారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు. గంజాయి, డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారం కోసం యాంటీ-డ్రగ్ హెల్ప్‌లైన్ నంబర్ 87126 56999కు సంప్రదించాలని కోరారు. ప్రజాప్రతినిధులు, పోలీస్ అధికారులు, వివిధ శాఖల అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, యువతతో కలిసి డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక పోలీస్ అధికారులు, ప్రజాప్రతినిధులు, పట్టణ ప్రముఖులు, విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






