31 March, 2026 | 3:55 AM

అడ్రస్ కోసం అడుక్కోవాల్సిందేనా?

31-03-2026 12:35 AM

కలెక్టరేట్‌లో ఏ కార్యాలయం ఎక్కడో?

ఏర్పాటు చేయని వివరాల బోర్డు 

మహబూబాబాద్, మార్చి 30 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సుమారు 60 కోట్ల వ్యయంతో నిర్మించిన సమీకృత జిల్లా కలెక్టర్, అధికారుల కార్యాలయ సముదాయంలో ఏ అధికారి కార్యాలయం ఎక్కడుందో తెలిపే విధంగా నేమ్ బోర్డులు ఏర్పాటు చేయలేదు. దీనితో ఆయా ప్రభుత్వ కార్యాలయాల అడ్రస్ కోసం ప్రజలు అడుక్కోవలసిన పరిస్థితి ఏర్పడింది. మహబూబాబాద్ జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేసిన తర్వాత 2023లో 60 కోట్ల ఖర్చుతో జి ప్లస్ టు విధానములో అత్యధికమైన సమీకృత కార్యాలయ సముదాయాన్ని నిర్మించారు.

ఇందులో జిల్లా పాలనాధికారి తో పాటు అదనపు కలెక్టర్లకు ప్రత్యేక చాంబర్లు ఏర్పాటు చేశారు. ఇక్కడి నుండే రాష్ట్రం తో పాటు జిల్లాలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన పాలన సాగించే విధంగా అన్ని హంగులు కల్పించారు. అలాగే వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన 40 జిల్లా స్థాయి అధికారులు, కార్యాలయాలు ఏర్పాటు చేశారు. అయితే ఆయా ప్రభుత్వ శాఖల కార్యాలయాలు మూడంతస్తుల భవనంలో ఎక్కడున్నాయో ప్రజలకు తెలిసే విధంగా కార్యాలయం ముందు నేమ్ బోర్డు ఏర్పాటు చేయలేదు.

కార్యాలయం ప్రారంభించి మూడు సంవత్సరాలు దాటినప్పటికీ ఇప్పటివరకు కలెక్టరేట్ లో ఏర్పాటుచేసిన వివిధ శాఖల అధికారులకు సంబంధించిన కార్యాలయాల వివరాలను ఎక్కడ కూడా ప్రజలు తెలుసుకునే విధంగా ప్రదర్శించలేదు. దీనితో ఆయా శాఖల అధికారులతో పాటు సేవల కోసం వచ్చే ప్రజలు తమకు అవసరమైన అధికారి కార్యాలయం ఎక్కడుందని అక్కడున్న వారిని ‘అడుక్కుంటూ’ వెతుక్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. కలెక్టరేట్ ఎదుట జీ ప్లస్ టు విధానంలో నిర్మిం చిన భవనంలో ఒక్కో ఫ్లోర్లో ఏ శాఖల అధికారులు, కార్యాలయాలు ఉన్నాయో తెలిపే విధంగా నేమ్ బోర్డు ఏర్పాటు చేయాల్సి ఉంది.

ఇతర జిల్లాలో నిర్మించిన సమీకృత కలెక్టరేట్ భవనాల్లో ప్రత్యేకంగా కార్యాలయం ముందు భాగంలో ప్రజలకు ఏ కార్యాలయం ఎక్కడుందని విషయాన్ని వివరించే విధంగా బోర్డులు ఏర్పాటు చేశారని, ఇక్కడ మాత్రం పట్టించుకోవడంలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే కనీసం ఆయా అంతస్తుల్లో ఏర్పాటు చేసిన వివిధ శాఖల కార్యాలయాల ఎదుట కూడా తమ శాఖకు సంబంధించిన వివరాలను తెలిపే విధంగా కొన్ని శాఖల అధికారులు చిన్నగా బోర్డులు ఏర్పాటు చేశారని, మరికొన్ని శాఖల అధికారులు ఆ విషయాన్ని కూడా పట్టించుకోలేదనే విమర్శలు వస్తున్నాయి. దీనివల్ల కలెక్టర్ కార్యాలయానికి వివిధ అవసరాల నిమిత్తం వచ్చే ప్రజలు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే అధికారులు కూడా ఆయా కార్యాలయాల అడ్రస్ కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని పాపోతున్నారు. 

ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదు

సమీకృత కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వివిధ శాఖల అధికారులు, కార్యాలయాలకు సంబంధించిన వివరాలు తెలుపుతూ కార్యాలయం ముందు భాగంలో నేమ్ బోర్డు ఏ ర్పాటు చేయాలని 2025 నుండి అధికారులకు ఫిర్యాదు చేస్తు న్నా పట్టించుకోవడం లేదు. ఇతర జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో ఏర్పాటుచేసిన బోర్డుల వివరాలను కూడా ఇక్కడి అధికారులకు చూపించి, ఆ విధంగా ఆయా ఫ్లోర్లలో ఏర్పాటుచేసిన కార్యాలయాల ముందు బోర్డులు ఏర్పాటు చేయాలని, అలాగే కలెక్టర్ కార్యాలయం ప్రధాన ద్వారం వద్ద ఏ ఫ్లోర్లో ఏ కార్యాలయం ఏ గదిలో ఏర్పాటు చేశారని మ్యాప్ కూడా ప్రదర్శించాలని కోరినా పట్టించుకోవడం లేదు.

దీనితో చదువుకున్న వారు, నిరక్షరాస్యులు కూడా తమకు సంబంధించిన కార్యాలయాల చిరునామా కోసం అడుక్కోవలసిన పరిస్థితి మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నెలకొంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రజలకు ఇబ్బంది లేకుండా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వివిధ శాఖల కార్యాలయాల వద్ద నేమ్ బోర్డులు, అలాగే ప్రధాన ద్వారం వద్ద ఆయా కార్యాలయాల చిరునామా సులువుగా తెలుసుకునే విధంగా బోర్డు ఏర్పాటు చేయాలి. 

మైస శ్రీనివాసులు, 

తెలంగాణ ప్రజల జాయింట్ యాక్షన్ ఫోరం, స్టేట్ కో కన్వీనర్