24 June, 2026 | 3:40 AM

మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి, ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలి

24-06-2026 12:51 AM

ఎస్పీ రోహిత్ రాజు పాల్వంచ గురుకుల పాఠశాలలో మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన సదస్సు

పాల్వంచ, జూన్ 23, (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్ష్మీదేవిపల్లి గ్రామంలో గల బాలుర గురుకుల పాఠశాలలో మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన సదస్సును మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా ఎస్పి రోహిత్ రాజు పాల్గొని వన మహోత్సవంలో భాగంగా పాఠశాల పరిధిలో మొక్కలు నాటారు.

అనంతరం మాదక ద్రవ్యాల నిర్మూలన అవగాహన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ యువత దేశానికి వెన్నుముక లాంటివారు, క్షణకాలపు ఆనందం కోసం మత్తు పదార్థాల వైపు ఆకర్షితులై, తమ బంగారు భవిష్యత్తును, తల్లిదండ్రుల ఆశలను చేతులారా నాశనం చేసుకుంటున్నారని, మాదక ద్రవ్యాల వల్ల శారీరకంగా మానసికంగా ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతుందని తెలియజేశారు.

అనంతరం సైబర్ నేరాల గురించి మాట్లాడుతూ అత్యాశకు పోయి త్వరితగతిన డబ్బును సంపాదించాలనే ఆలోచనతో చాలామంది సైబర్ నేరాల బారిన పడి కష్టపడి సంపాదించిన నగదును కోల్పోతున్నా రని, చదువుకున్నవారే ఎక్కువమంది సైబర్ నేరాలు బారిన పడుతున్నారని తెలిపారు. ఓటీపి ట్రాప్, ఆన్లైన్ ట్రేడింగ్, సోషల్ మీడియాల ద్వారా ప్రస్తుతం జరుగుతున్న సైబర్ నేరాల గురించి వివరించారు. అనంతర రోడ్డు భద్రతా నియమాలను పాటించడంలో స్వీయ క్రమశిక్షణ కలిగి ఉంటే చాలావరకు రోడ్డు ప్రమాదాలను అరికట్టవచ్చని, హెల్మెట్ వినియోగం,సీటు బెల్ట్ ప్రాధాన్యత,డిఫెన్సివ్ డ్రైవింగ్ నియమాల గురించి వివరించారు.

డ్రంక్ అండ్ డ్రైవ్,ర్యాష్ డ్రైవింగ్, సెల్ఫోన్ డ్రైవింగ్,రాంగ్ రూట్, సిగ్నల్ జంపింగ్, ఓవర్ లోడ్ వలన కలిగే ప్రమాదాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్వంచ డిఎస్పి ఆర్. సతీష్ కుమార్, ఎస్బిఐ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్,  పాల్వంచ సీఐ సతీష్, ఎక్సైజ్ సీఐ ప్రసాద్, పోలీసు అధికారులు, పాఠశాల మరియు కళాశాల, అధ్యాపకులు,ఉపాధ్యాయులు సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.