22 June, 2026 | 4:22 AM

బోధన్‌లో ఘనంగా 12వ జాతీయ యోగా దినోత్సవం

22-06-2026 12:00 AM

ఆకట్టుకున్న ’వాక్ ఫర్ యోగా’ మరియు ఆసనాల ప్రదర్శన

బోధన్, జూన్21(విజయ క్రాంతి): బోధన్ పట్టణంలో 12వ జాతీయ యోగా దినోత్సవ వేడుకలను పతాంజలి జ్ఞాన యోగ సెంటర్ మరియు ఓం యోగాశాల సంయుక్త ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఆదివారం ఉదయం స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో పిల్లలు, పెద్దలు, స్థానిక ప్రముఖులందరూ కలిసి మానవహారంగా ఏర్పడి యోగా ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. అనంతరం అక్కడి నుంచి అనిల్ టాకీస్ రోడ్, ఎక్స్ రోడ్స్ మీదుగా టీటీడీ కల్యాణ మండపం వరకు సుమారు 350 మందితో ’వాక్ ఫర్ యోగా’ (ర్యాలీ) కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు.

టీటీడీ కల్యాణ మండపంలో యోగా మాస్టర్లు మాధవి, గంగాధర్  శిష్యులు ప్రదర్శించిన కఠినమైన యోగాసనాలు సభికులను, విద్యార్థులను అబ్బురపరిచాయి. ఈ సందర్భంగా నిర్వాహకులు, యోగా మాస్టర్లు మాధవి, గంగాధర్ మాట్లాడుతూ.. నిత్యం యోగా సాధన చేస్తే వైద్యుల వద్దకు వెళ్లాల్సిన అవసరం రాదని, క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులను సైతం యోగా ద్వారా నయం చేసుకోవచ్చని మరియు నివారించవచ్చని వివరించారు.

ఈ విశేష కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏసీపీ శ్రీనివాస్, ఎంఈఓ నాగయ్య, సీఐ వెంకటనారాయణ, ఆర్టీఓ యశ్వంత్, రిటైర్డ్ ఎంఈవో బాలగంగాధర్, ఉషోదయ విద్యాసంస్థల ఎండీ సూర్య ప్రకాష్ దంపతులు, వంశీ విద్యాసంస్థల ఎండీ విజయ్ కుమార్ దంపతులు, వార్డ్ కౌన్సిలర్ దాము, అర్చకులు ఉదయ్ మహారాజ్, డాక్టర్ అరుణ్, సీనియర్ రిపోర్టర్ బలరామరాజు తదితరులు విచ్చేశారు. వీరు కేవలం హాజరుకావడమే కాకుండా, స్వయంగా యోగాసనాలు వేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు.

ప్రతి ఒక్కరూ యోగాను తమ దైనందిన జీవితంలో ఒక భాగం చేసుకోవాలని అతిథులు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. కార్యక్రమం అనంతరం పాల్గొన్న వారందరికీ అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగింది. అందరి సహకారంతో ఈ యోగా దినోత్సవ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.