నారపల్లిలో కిరాణా షాప్ పై ఉప్పల్ జోన్ ఎస్ఓటి పోలీసుల దాడి
- భారీగా అక్రమ మద్యం సీజ్
- కిరాణా నిర్వాకుడు అరెస్ట్
ఘట్ కేసర్, సెప్టెంబర్ 25 (విజయక్రాంతి) : ఘట్ కేసర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ (Ghat Kesar Excise Police Station)పరిధి లోని నారపల్లి సురేందర్‌రెడ్డి నగర్ కాలనీలో అక్రమంగా నిల్వ ఉంచిన మద్యంపై ఉప్పల్ జోన్ ఎస్ఓటి పోలీసులు, ఎక్సైజ్ అధికారులు దాడి నిర్వహించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కాలనీలోని ఇంటి నంబర్ 5-75లో కిరాణా దుకాణం నిర్వహిస్తున్న శివాజీ జాదవ్ (45) అక్రమంగా మద్యం నిల్వ చేసి విక్రయిస్తున్నట్లు అధికారులకు సమాచారం అందింది.
సమాచారం మేరకు అధికారులు సదరు ఇంటితో పాటు కిరాణా దుకాణంలో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో వివిధ బ్రాండ్లకు చెందిన మద్యం, బీర్ బాటిళ్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 71.230 లీటర్ల మద్యాన్ని సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఇందులో ఆఫీసర్స్ ఛాయిస్, కె.కె. విజిల్, ఇంపీరియల్ బ్లూ, రాయల్ స్టాగ్, మెక్‌డోవెల్స్ తదితర బ్రాండ్ల మద్యం బాటిళ్లతో పాటు కింగ్‌ఫిషర్ లైట్, కింగ్‌ఫిషర్ స్ట్రాంగ్ బీర్ బాటిళ్లు ఉన్నట్లు పేర్కొన్నారు. రూ. 1లక్ష 16 వేలు విలువైన మద్యంను స్వాధీనం చేసుకున్న ట్లు తెలిపారు.
అనుమతులు లేకుండా మద్యం నిల్వ చేసి విక్రయిస్తున్నట్లు గుర్తించిన అధికారులు దేవావత్ జాదవ్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. అనంతరం తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. అక్రమంగా మద్యం నిల్వ చేయడం, విక్రయించడం చట్టవిరుద్ధమని, ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.