రేపటిలోపు పూర్తి చేయాలని మంత్రి సూచన
హైదరాబాద్: 11 రోజులుగా ఘనంగా నిర్వహించిన గణేశ్ ఉత్సవాల ముగింపు సందర్భంగా ఈరోజు చివరి రోజు నిమజ్జన కార్యక్రమం కొనసాగుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) పేర్కొన్నారు. ఖైరతాబాద్ బడా గణేశ్, బాలాపూర్ గణేశ్‌తో పాటు హైదరాబాద్ జంట నగరాల్లోని వివిధ ప్రాంతాల్లో ప్రతిష్టించిన గణేశ్ విగ్రహాల నిమజ్జనం జరుగుతోంది. అంతేకాకుండా మధ్యాహ్నం ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం(Khairatabad Ganesh Immersion) పూర్తైందని, నిమజ్జన ప్రక్రియను ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు ప్రభుత్వంలోని అన్ని శాఖలను సమన్వయం చేస్తూ భక్తులకు, ఉత్సవ నిర్వాహకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఇవాళ నిమజ్జన ప్రక్రియలో భాగంగా డీజీపీ, జిల్లా కలెక్టర్, జీహెచ్ఎంసీ కమిషనర్, పోలీస్ కమిషనర్ తదితర అధికారులు సమన్వయంతో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఏరియల్ వ్యూ కూడా నిర్వహించడం జరిగిందని, పరిస్థితి ప్రశాంతంగా, నియంత్రణలో ఉందని, ప్రస్తుతం నిమజ్జన ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది.
నిమజ్జన కార్యక్రమం ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా సజావుగా సాగేందుకు ప్రభుత్వం, పోలీస్, జీహెచ్ఎంసీ అధికారులు సమన్వయంతో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. నగరంలోని కీలక ప్రాంతాల్లో భద్రత, ట్రాఫిక్ నిర్వహణ, నిమజ్జన ఏర్పాట్లపై నిరంతరం నిఘా కొనసాగుతోంది. నిమజ్జన బందోబస్తు కోసం హైదరాబాద్‌లో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. కొన్ని ప్రధాన ప్రాంతాల్లో వాహనాల రద్దీ కనిపించినప్పటికీ, ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు సంబంధిత శాఖలు చర్యలు చేపడుతున్నాయి. నిమజ్జన ప్రధాన మార్గాల్లో ఇవాళ, రేపు ఉదయం వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని ఆయన వెల్లడించారు.
మరోవైపు వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో విగ్రహాల తరలింపు, నిమజ్జన ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులు నిర్వాహకులను కోరుతున్నారు. అన్ని ఉత్సవ కమిటీలు, భక్తులు సమన్వయంతో వ్యవహరిస్తే నిమజ్జన కార్యక్రమాన్ని మరింత సాఫీగా పూర్తి చేయవచ్చని మంత్రి సూచించారు. నిమజ్జన వేడుకల్లో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వ్యవహరించాలని, ప్రమాదాలకు తావులేకుండా పోలీసుల సూచనలు పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. గణపయ్యకు వీడ్కోలు పలికే ఈ చివరి రోజు వేడుకలను భక్తులు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కోరుతున్నారు.