వరద ఉధృతిలో కొట్టుకుపోయిన ఎమ్మెల్యే
శ్రీకాకుళం: జిల్లాలో వరద పరిస్థితిని స్వయంగా పరిశీలించేందుకు వెళ్లిన టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్(TDP MLA Koona Ravi Kumar) సహా పలువురు అధికారులు ప్రమాదంలో చిక్కుకున్నారు. వరద ప్రవాహం ఒక్కసారిగా పెరగడంతో ఎమ్మెల్యేతో పాటు జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇతర అధికారులు కూడా ఇబ్బందుల్లో పడ్డారు. వరద(Flood ) ప్రభావిత ప్రాంతాలను పరిశీలించేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు బోటులో వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. పరిస్థితి అదుపు తప్పడంతో వెంటనే రంగంలోకి దిగిన రెస్క్యూ బృందాలు ఎమ్మెల్యే కూన రవికుమార్, కలెక్టర్, ఎస్పీతో పాటు ఇతర అధికారులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.
ఇదిలా ఉండగా, భారీ వర్షాల కారణంగా శ్రీకాకుళం జిల్లా(Srikakulam District)లోని నాగావళి, వంశధార నదుల్లో వరద ప్రవాహం పెరిగింది. వంశధారకు తొలి వరద హెచ్చరిక జారీ కాగా.. లోతట్టు, నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రస్తుతం జిల్లా యంత్రాంగం వరద పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తోంది. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు నదులు, వాగులు దాటేందుకు ప్రయత్నించవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.