సీఈసీకి 48 గంటల డెడ్‌లైన్.. రంగంలోకి సీజీపీ
న్యూఢిల్లీ: ఎన్నికల సంఘం(Election Commission) వ్యవహారంపై కొనసాగుతున్న వివాదం మరింత ముదిరింది. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ 48 గంటల్లో రాజీనామా చేయాలని సీజీపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే(CGP founder Abhijeet Dipke) డిమాండ్ చేశారు. గడువులోగా రాజీనామా చేయకపోతే దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మరోసారి నిరసన చేపడతామని దీప్కే ప్రకటించారు. అలాగే త్వరలో జరగనున్న రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను తాత్కాలికంగా నిలిపివేయాలని, ఎన్నికల జాబితాల ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియను కూడా నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ డిమాండ్లు ఈసీలోని అంతర్గత విభేదాలపై వచ్చిన నివేదికల నేపథ్యంలో తెరపైకి వచ్చాయి. అయితే ఎన్నికల సంఘం మాత్రం కమిషనర్ల మధ్య భిన్నాభిప్రాయాలు సాధారణ నిర్ణయ ప్రక్రియలో భాగమేనని, తుది నిర్ణయాలు ముగ్గురు కమిషనర్ల ఆమోదంతోనే తీసుకున్నామని స్పష్టం చేసింది.