అత్యంత వైభవంగా వినాయక నిమజ్జన శోభయాత్రలు

25-09-2026 | 09:55pm

ఘట్ కేసర్, సెప్టెంబర్ 25 (విజయక్రాంతి) : 11రోజుల పాటు విశేష పూజలందుకున్న  శ్రీ వినాయకస్వామి నిమజ్జన వేడుకలు(Sri Vinayaka Swamy Immersion Celebrations) శుక్రవారం కన్నులపండువగా సాగుతోంది. శోభయాత్రలో భక్తుల కోలాహలంతో వీధులన్నీ గణపతి నామస్మరణతో మారుమోగిపోతున్నాయి. నిమజ్జన ఊరేగింపుల్లో ప్రతి వీధి ఒక పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది.

 డప్పు చప్పుళ్లు, తీన్‌మార్‌ దరువులు, కోలాటాలు, భజన బృందాల ప్రదర్శనల నడుమ యువత, మహిళలు, పిల్లలు ఎంతో ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ ఊరేగింపుల్లో పాల్గొంటున్నారు.  గణపతి బప్పా మోరియా అంటూ భక్తులు గులాల్ (రంగులు) చల్లుకుంటూ స్వామికి వీడుకోలుగా వీడ్కోలు పలుకుతున్నారు. ఘట్ కేసర్ సర్కిల్(Ghatkesar Circle) పరిధిలోని వినాయకులను ఎదులాబాద్ లక్ష్మీనారాయణ చెరువు(Edulabad Lakshminarayana Cheruvu) వద్ద నిమజ్జనం చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

 నిమజ్జనానికి ముందు జరిగే వినాయకుని లడ్డు వేలం పాటలకు విశేష ఆదరణ లభించింది. వినాయకుని ప్రసాదంగా భావించే ఈ లడ్డును దక్కించుకోవడానికి భక్తులు తీవ్రంగా పోటీపడ్డారు.

ఊరేగింపులు, నిమజ్జనం సాఫీగా సాగేందుకు పోలీసు శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. సిసిటీవీ కెమెరాలు, డ్రోన్ల ద్వారా నిఘా ఉంచారు. నిమజ్జనానికి తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం అన్ని రకాల సదుపాయాలను అందుబాటులో ఉంచారు. 11రోజుల పాటు విశేష పూజలందుకున్న విఘ్నేశ్వరుడు భక్తుల కష్టాలను, విఘ్నాలను తొలగించి, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ భక్తజనం  వీడ్కోలు పలుకుతున్నారు.

మరిన్ని వార్తలు