రైతుకు న్యాయం చేయాలని రైతు డిపో ఎదుట ధర్నా

25-09-2026 | 10:13pm

బోధన్, సెప్టెంబర్ 25 (విజయ క్రాంతి): బెల్లాల్ గ్రామానికి చెందిన రైతు రాంసింగ్(Farmer Ramsingh) పంట నష్టపోయిన ఘటనపై న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం బోధన్ పట్టణంలోని(Bodhan town) రైతు డిపో వద్ద వామపక్ష పార్టీలు, బీఆర్‌ఎస్ నాయకులు, బెల్లాల్ గ్రామ ప్రజలు కలిసి ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా సీపీఐ(ఎం) నిజామాబాద్ జిల్లా కమిటీ సభ్యులు(Nizamabad District Committee Members), బోధన్ మండల కార్యదర్శి ఏషాల గంగాధర్, సీపీఐ(ఎంఎల్) జిల్లా నాయకులు బండారి మల్లేష్, దళిత సంఘాల నాయకులు విద్యాసాగర్ మాట్లాడుతూ.. బెల్లాల్ గ్రామానికి చెందిన రైతు రాంసింగ్ సెప్టెంబర్ 21న రైతు డిపో నుంచి పంటకు దోమ తెగులు వచ్చిందని చెప్పి మందులు తీసుకెళ్లి తన రెండున్నర ఎకరాల పొలంలో పిచికారీ చేశారని తెలిపారు. మందు పిచికారీ చేసిన అనంతరం పంట పూర్తిగా దెబ్బతిని కాలిపోయినట్టుగా మారి తీవ్రంగా నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు.

రైతు రాంసింగ్‌కు జరిగిన నష్టంపై బెల్లాల్ సర్పంచ్ రాజు, మాజీ సర్పంచ్ బుర్రి లక్ష్మణ్, ఉపసర్పంచ్ నీలకంఠ గౌడ్ తదితరులు నాలుగు రోజులుగా రైతు డిపో నిర్వాహకులతో చర్చలు జరిపినా సమస్య పరిష్కారం కాలేదని నాయకులు తెలిపారు. బాధ్యతను కంపెనీపై, కంపెనీని రైతు డిపోపై నెట్టే ప్రయత్నం జరుగుతోందని ఆరోపిస్తూ ధర్నా చేపట్టినట్లు చెప్పారు.

ధర్నా విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని రైతు డిపో డీలర్, రైతు, వివిధ పార్టీల నాయకులతో చర్చించారు. సెప్టెంబర్ 28న కంపెనీ ప్రతినిధులు, రైతు డిపో డీలర్‌ను పిలిపించి రైతు, పార్టీల నాయకుల సమక్షంలో చర్చలు నిర్వహించి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నాను తాత్కాలికంగా విరమించినట్లు నాయకులు తెలిపారు.

రైతు రాంసింగ్‌కు జరిగిన పంట నష్టంపై వ్యవసాయ శాఖ అధికారులు, జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డి స్పందించి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. రెండున్నర ఎకరాల్లో పంట నష్టపోయినందుకు ఎకరానికి 50 బస్తాల చొప్పున మొత్తం 125 బస్తాలకు ప్రభుత్వం ప్రకటించే మద్దతు ధరను లెక్కించి రైతుకు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.

రైతుకు న్యాయం జరగని పక్షంలో వామపక్ష, ప్రతిపక్ష పార్టీలను కలుపుకుని జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేపట్టి, రాంసింగ్‌కు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని నాయకులు హెచ్చరించారు.

ఈ ధర్నాలో బెల్లాల్ సర్పంచ్ రాజు, మాజీ సర్పంచ్ బుర్రి లక్ష్మణ్, ఉపసర్పంచ్ నీలకంఠ గౌడ్, రైతులు, గ్రామ ప్రజలు, బాధిత రైతు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు