NCLT గుడ్‌న్యూస్.. 10 కంపెనీల మెర్జర్‌కు ఓకే

25-09-2026 | 06:19pm

ముంబై: అదానీ పవర్‌(Adani Power)కు సంబంధించిన కీలక విలీన ప్రక్రియకు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT) నుంచి తుది అనుమతులు లభించాయి. కంపెనీకి చెందిన 10 అనుబంధ సంస్థలను అదానీ పవర్‌లో విలీనం చేసే పథకంలో భాగంగా మిగిలిన విదర్భ ఇండస్ట్రీస్ పవర్ లిమిటెడ్ (VIPL) విలీనానికీ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(NCLT) ముంబై బెంచ్ సెప్టెంబర్ 24న ఆమోదం తెలిపింది. దీంతో మొత్తం విలీన ప్రక్రియకు అవసరమైన న్యాయపరమైన అనుమతులు పూర్తయ్యాయి.

ఈ విలీన పథకంలో అదానీ పవర్‌కు చెందిన పలు అనుబంధ సంస్థలు ఉన్నాయి. ఇందులో అదానీ పవర్ దహేజ్ లిమిటెడ్, కచ్ పవర్ జనరేషన్ లిమిటెడ్, రిసర్జెంట్ ఫ్యూయల్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్, మహాన్ ఫ్యూయల్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్, ఒడిశా థర్మల్ ఎనర్జీ లిమిటెడ్, కోర్బా పవర్ లిమిటెడ్, అనుప్పూర్ థర్మల్ ఎనర్జీ (ఎంపీ) ప్రైవేట్ లిమిటెడ్, మీర్జాపూర్ థర్మల్ ఎనర్జీ (యూపీ) ప్రైవేట్ లిమిటెడ్, ఎంబెరిజా ఇన్‌ఫ్రా పార్క్ లిమిటెడ్ తో పాటు విదర్భ ఇండస్ట్రీస్ పవర్ ఉన్నాయి.

ఇప్పటికే ఆగస్టు 4న NCLT అహ్మదాబాద్ బెంచ్ తొమ్మిది అనుబంధ సంస్థల విలీనానికి అనుమతి ఇచ్చింది. VIPLకి సంబంధించిన అంశం ముంబై బెంచ్ పరిధిలో ఉండటంతో దానికి సంబంధించిన ఆమోదం తాజాగా వచ్చింది. దీంతో పది సంస్థల విలీన పథకానికి అవసరమైన రెండు బెంచ్‌ల అనుమతులు పూర్తయ్యాయి.

ఈ పథకం ప్రకారం ఆయా అనుబంధ సంస్థల ఆస్తులు, బాధ్యతలు, హక్కులు, ఇతర సంబంధిత అంశాలు అదానీ పవర్‌కు బదిలీ అవుతాయి. ఇవన్నీ పూర్తిగా అదానీ పవర్‌కు చెందిన అనుబంధ సంస్థలు కావడంతో కొత్తగా బాహ్య షేర్‌హోల్డర్లకు ఈక్విటీ షేర్ల కేటాయింపు ఉండదని సంబంధిత వివరాలు వెల్లడిస్తున్నాయి.

విలీన ప్రక్రియ పూర్తయిన తర్వాత సంబంధిత అనుబంధ సంస్థలు ప్రత్యేక సంస్థలుగా కొనసాగకుండా అదానీ పవర్‌లో కలిసిపోనున్నాయి. ఈ చర్య సంస్థల నిర్మాణాన్ని సరళీకరించడంతో పాటు వ్యాపార కార్యకలాపాలను ఒకే సంస్థ పరిధిలోకి తీసుకురావడమే లక్ష్యంగా ఉన్న విలీన పథకంలో భాగంగా ఉంది.

మరిన్ని వార్తలు