డ్రోన్లు గాల్లో.. కెమెరాలు నిఘాలో.. హైదరాబాద్ చుట్టూ నిఘా!
హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనం.. అడుగడుగునా పోలీస్ నిఘా!
హైదరాబాద్: గణేష్ నిమజ్జన మహోత్సవానికి(Hyderabad Ganesh Immersion 2026) భాగ్యనగరం సిద్ధమైంది. లక్షలాది మంది భక్తులు, వేలాది విగ్రహాలు శోభాయాత్రలో పాల్గొనే నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతా(Police security) ఏర్పాట్లు చేశారు. నగరవ్యాప్తంగా సుమారు 20 వేల మంది పోలీస్ సిబ్బందిని రంగంలోకి దించారు. శోభాయాత్ర జరిగే ప్రధాన మార్గాలపై 10 వేలకుపైగా CCTV కెమెరాలతో నిరంతర నిఘా కొనసాగనుంది. పరిస్థితులను కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షించడంతో పాటు 24 డ్రోన్లు, దాదాపు 100 హైరైజ్ కెమెరాలు(Hyderabad Ganesh immersion CCTV) కూడా రంగంలోకి దిగాయి. వీటి ద్వారా జనసమ్మర్థాన్ని గమనించడంతో పాటు విగ్రహాల లెక్కింపునకు సాంకేతికతను వినియోగించనున్నారు.
ఇతర జిల్లాల నుంచి 8,142 మంది సిబ్బందితో 42 ప్లాటూన్లను ఏడు సెక్యూరిటీ జోన్లలో కేటాయించారు. సున్నిత ప్రాంతాల్లో 4 RAF కంపెనీలు, 2 CRPF కంపెనీలను మోహరించారు. అదనంగా బాంబ్ డిటెక్షన్ బృందాలు కూడా నగరవ్యాప్తంగా తనిఖీలు చేపట్టనున్నాయి. మహిళల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తూ 26 SHE Teams మూడు షిఫ్టుల్లో విధులు నిర్వహించనున్నాయి. కీలక ప్రాంతాల్లో సాధారణ దుస్తుల్లో ప్రత్యేక బృందాలు కూడా నిఘా పెట్టనున్నాయి. నిమజ్జన(Ganesh immersion Tank Bund 2026) ప్రాంతాల్లో రెస్క్యూ బోట్లు, గజ ఈతగాళ్లు, అంబులెన్సులు, ఫైర్ ఇంజిన్లు వంటి అత్యవసర సేవలను సిద్ధంగా ఉంచారు. ఇలా టెక్నాలజీ, భారీ పోలీస్ బందోబస్తు, కేంద్ర బలగాలతో హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జన శోభాయాత్రకు భద్రతా వలయం ఏర్పాటు చేశారు.