బాలాపూర్ లడ్డూ కథ తెలుసా? సీక్రెట్ ఇదే!

25-09-2026 | 07:55am

హైదరాబాద్ గణేశ్ ఉత్సవాల్లో బాలాపూర్ లడ్డూ వేలం(Balapur Ganesh Laddu Record) అంటే ప్రత్యేకమైన క్రేజ్. ప్రతి ఏడాది గణపయ్య నిమజ్జనం రోజున జరిగే ఈ వేలం కోసం భక్తులు, ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అయితే ఈ లడ్డూ వేలం వెనుక దశాబ్దాల చరిత్ర ఉందనే విషయం చాలామందికి తెలియదు. 1994లో కేవలం రూ.450తో బాలాపూర్ లడ్డూ వేలం ప్రారంభమైంది. స్థానిక రైతు కొలను మోహన్‌రెడ్డి తొలిసారి లడ్డూను దక్కించుకున్నారు. ఆ తర్వాత ఏడాది రూ.4,500కు వేలం వెళ్లడంతో ఈ లడ్డూపై ప్రత్యేక నమ్మకం, ఆసక్తి మరింత పెరిగింది.

కాలంతో పాటు వేలం ధర(Balapur Laddu Auction) కూడా భారీగా పెరిగింది. 2002లో తొలిసారి లక్ష రూపాయల మార్క్‌ను దాటిన లడ్డూ.. 2015లో రూ.10.32 లక్షలు, 2017లో రూ.15.60 లక్షలు, 2022లో రూ.24.60 లక్షలు పలికింది. 2023లో రూ.27 లక్షలు, 2024లో రూ.30.01 లక్షలకు చేరింది. ఇక 2025లో బాలాపూర్ లడ్డూ మరో రికార్డు సృష్టించింది. కర్మన్‌ఘాట్‌కు చెందిన లింగాల దశరథ్‌గౌడ్ రూ.35 లక్షలకు లడ్డూను సొంతం చేసుకున్నారు. అంటే మూడు దశాబ్దాల్లో రూ.450 నుంచి రూ.35 లక్షలకు చేరిందన్నమాట.

ఈ లడ్డూను భక్తులు కేవలం ప్రసాదంగానే కాకుండా శుభం, ఐశ్వర్యానికి ప్రతీకగా భావిస్తుంటారు. తొలి విజేత మోహన్‌రెడ్డి లడ్డూ ప్రసాదాన్ని కుటుంబ సభ్యులతో పాటు స్థానికులకు పంచి, పొలంలోనూ ఉపయోగించారని పాత నివేదికలు పేర్కొంటున్నాయి. ఆ తర్వాత బాలాపూర్ లడ్డూపై(Ganesh Laddu Auction Hyderabad) ప్రత్యేక విశ్వాసం మరింత బలపడింది. అందుకే ప్రతి ఏడాది వేలం మొదలైనప్పటి నుంచి చివరి బిడ్ వరకు ఉత్కంఠ కొనసాగుతుంది. ధర పెరుగుతుందా? కొత్త రికార్డు నమోదవుతుందా? అనే ఆసక్తి బాలాపూర్ లడ్డూను గణేశ్ ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలబెట్టింది.

మరిన్ని వార్తలు