04-02-2026 02:43:45 PM
శిక్షణ పూర్తి చేసుకున్న లైసెన్స్ సర్వేయర్లకు కలెక్టరేట్ లో ధృవీకరణ పత్రాలను అందజేతలో జిల్లా కలెక్టర్ శ్రీహర్ష
పెద్దపల్లి,ఫిబ్రవరి 04(విజయక్రాంతి): భూ రికార్డుల పై రైతులకు, యాజమాన్యులకు భరోసా కల్పించేలా లైసెన్స్ సర్వేయర్ లు పని చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. జిల్లా కలెక్టర్ సమీకృత జిల్లా కలెక్టరేట్ లో అదనపు కలెక్టర్ డి. వేణుతో కలిసి శిక్షణ పూర్తి చేసుకున్న 61 మంది సర్వేయర్లకు ధృవీకరణ లైసెన్స్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల ఆశయాలకు అనుగుణంగా పని చేస్తూ పేద ప్రజల కష్టాలను తొలగించేందుకు రైతులకు చుట్టంగా ఉండే విధంగా అద్భుతమైన భూ భారతి చట్టం ప్రభుత్వం ప్రవేశపెట్టిందని అన్నారు.
భూ భారతి చట్టం నియమ నిబంధనలు కూడా 90 రోజుల్లో ఏర్పాటు చేశామని అన్నారు. ప్రతి మనిషికి ఆధార్ కార్డు ఉన్న విధంగా భూములకు భూ దార్ ప్రవేశపెడతామని మాట ఇచ్చామని, దీని కోసం అవసరమైన మేర లైసెన్స్ సర్వేయర్ లు అందుబాటులో ఉండే విధంగా వివిధ రాష్ట్రాలలో అధ్యయనం చేసి ప్రైవేట్ సర్వేయర్ లను ప్రవేశపెట్టామని అన్నారు. లైసెన్స్ సర్వేయర్ లుగా పనిచేసేందుకు ఆసక్తిగల 10 వేల 120 మంది అభ్యర్థి నుంచి దరఖాస్తుల స్వీకరించి మొదటి విడతలో 6500 మందికి అవసరమైన శిక్షణ అందించి జెఎన్టీయూ ద్వారా నిర్వహించిన పరీక్షలు ఉత్తీర్ణత సాధించిన 3511 మందికి గతంలో లైసెన్స్ లను ముఖ్యమంత్రి చేతుల మీదుగా పంపిణీ చేశామని అన్నారు.
రెండవ విడత లో మరో 6 వేల మధ్య అభ్యర్థులకు శిక్షణ అందించి పరీక్షలు పెడితే 2 వేల మంది ఉత్తీర్ణత సాధించారని , నేడు మన పెద్దపల్లి జిల్లాలో అర్హత సంపాదించిన 61 మంది అభ్యర్థులకు లైసెన్సులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. లైసెన్స్ సర్వేయర్ లను మండలాల వారీగా ప్రతి అందుబాటులో ఉన్న భూమి ఆధారంగా అలాట్మెంట్ చేస్తామని అన్నారు. భూములు ఉన్న రైతులకు భరోసా కల్పించే భూ భారతి చట్టం అమలు కోసం సర్వేయర్ లకు ఆధునిక సాంకేతిక వినియోగించేందుకు రోవర్స్ సామాగ్రి ప్రభుత్వం పంపిణీ చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏడి సోమేశ్వర్,ఆర్.డి.ఓ. గంగయ్య, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.