20-02-2026 01:04:42 AM
ఆతిథ్య జట్టుపై సంచలన విజయం
కొలంబో, ఫిబ్రవరి 19 : టీ20 ప్రపంచకప్‌లో చిన్న జట్ల సంచలనాలు కంటిన్యూ అవుతున్నాయి. ఇప్పటికే ఆస్ట్రేలియాను ఓడించి ఆశ్చర్యపరిచిన జింబాబ్వే తాజాగా ఆతి థ్య జట్టు శ్రీలంకకు కూడా దిమ్మతిరిగే షాకిచ్చింది. కొలంబో వేదికగా జరిగిన మ్యాచ్‌లో లంకను 6 వికెట్ల తేడాతో ఓడించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 20 ఓవర్లలో 7 వికెట్లకు 178 పరుగులు చేసింది. ఆసీస్‌పై సెంచరీతో అదరగొట్టిన నిస్సాంక మరోసారి హాఫ్ సెంచరీతో రాణించాడు.
కుశాల్ పెరీరాతో కలిసి తొలి వికెట్‌కు 54 పరుగులు జోడించాడు. కుశాల్ పెరీరా 22 రన్స్‌కు ఔటవగా.. నిస్సాంక 41 బంతుల్లో 8 ఫోర్లతో 62 పరుగులు చేశాడు. వికెట్ కీపర్ కుశాల్ మెండిస్(14) త్వరగానే వెనుదిరిగినా పవన్ రత్నానాయకే(44) దూకుడుగా ఆడడంతో శ్రీలంక మంచి స్కోర్ చేయగలిగింది. చివర్లో వేగంగా పరుగులు చేసే క్రమంలో లంక వరుస వికెట్లు కోల్పోయింది. జింబాబ్వే బౌలర్లలో క్రీమన్, ఇవాన్స్, ముజర్బానీ రెండేసి వికెట్లు పడగొట్టారు.
తర్వాత ఛేజింగ్‌లో జింబాబ్వే మొదట నుంచే దూకుడుగా ఆడింది. బ్రియాన్ బెన్నెట్ మరోసారి అదరగొట్టాడు. ఆసీస్ పై సత్తా చాటిన అతడు ఈ మ్యాచ్ లోనూ లంక బౌలర్లను ఆటాడుకున్నాడు. 48 బంతుల్లో 8 ఫోర్లతో 63 పరుగులతో రాణించాడు. అతనితో పాటు కెప్టెన్ సికిందర్ రాజా 26 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్లతో 45 రన్స్ చేశాడు. మ్యాచ్ చివర్లో కాసేపు ఉత్కంఠ నెలకొంది. చివరి ఓవర్లో విజయం కోసం 8 రన్స్ చేయాల్సి ఉండగా.. తీక్షణ వేసిన తొలి బంతినే మున్యోంగ సిక్సర్ గా మలిచాడు. దీంతో జింబాబ్వే విజయం ఖాయమైంది.
శ్రీలంక బౌలర్లలో దుషన్ హేమంత రెండు వికెట్లు తీయగా.. డసన్ షనక, దునిత్ వెల్లలేగ చెరో వికెట్ పడగొట్టారు. ఈ గెలుపుతో జింబాబ్వే గ్రూప్-బీ టాపర్‌గా నిలవగా.. సొంతగడ్డపై లంక ఊహించని పరాభవం చవిచూసింది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే సూపర్ 8 గ్రూప్ 1లో చోటు దక్కించుకున్న భారత్, సౌతాఫ్రికా, వెస్టిండీస్ , జింబాబ్వే జట్లు ఒక్క మ్యాచ్‌లో కూడా ఓడిపోలేదు. దీంతో సూపర్ 8లో హోరాహోరీ సమరాలు అభిమానులను అలరించనున్నాయి.