అగ్నివీర్ వాయు విభాగానికి ఎంపికైన యువతులు జిల్లాకు గర్వకారణం
యువశక్తి ప్రోగ్రామ్ ద్వారా యువతకు ఉజ్వల భవిష్యత్తు
మరింత మంది యువతులు సైన్యంలో చేరేందుకు ముందుకు రావాలి
జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష
పెద్దపల్లి,(విజయక్రాంతి): పెద్దపల్లి యువశక్తి ప్రోగ్రామ్‌లో శిక్షణ పొందిన యువతులు సిలివెరి శ్రీజ, చిప్ప శశివర్షిణి భారత సైన్యంలో అగ్నివీర్ వాయు విభాగానికి ఎంపిక కావడం జిల్లాకు గర్వకారణమని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. అగ్నివీర్ వాయు విభాగానికి ఎంపికైన యువతులను సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దేశ సేవ కోసం భారత సైన్యం, భారత వైమానిక దళంలో చేరడం ఎంతో గౌరవప్రదమైన విషయమన్నారు.
యువశక్తి ప్రోగ్రామ్‌లో శిక్షణ పొందిన ఇద్దరు యువతులు అగ్నివీర్ వాయు విభాగానికి ఎంపిక కావడం జిల్లా యువతకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. జిల్లా నుంచి మరింత మంది యువత, ముఖ్యంగా యువతులు భారత సైన్యం, వైమానిక దళం, నౌకాదళం వంటి రక్షణ రంగాల్లో అవకాశాలను సద్వినియోగం చేసుకొని దేశ సేవలో భాగస్వాములు కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. యువశక్తి ప్రోగ్రామ్ ద్వారా యువతకు అవసరమైన శిక్షణ, మార్గదర్శనం, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు సహాయ సహకారాలు అందిస్తూ వారి భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు జిల్లా యంత్రాంగం కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు.
యువత ఉపాధి, ఉద్యోగ అవకాశాలను సాధించేందుకు ఈ కార్యక్రమం సమర్థవంతమైన వేదికగా నిలుస్తోందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగాలు సాధించిన యువతుల తల్లిదండ్రులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ జిల్లా అధికారులకు, యువశక్తి ప్రోగ్రామ్ నిర్వాహకులకు, శిక్షణ అందించిన సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యువశక్తి ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ లెంకల మహిపాల్ రెడ్డి, జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.






