3 August, 2026 | 10:09 AM

బీఆర్ఎస్ లోకి యువ‌కులు

03-08-2026 08:59 AM

పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన మాజీ మేయ‌ర్ జ‌క్క‌ వెంకట్ రెడ్డి 

మేడిపల్లి, (విజయక్రాంతి): మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మేడిపల్లి, పీర్జాదిగూడ డివిజన్లకు చెందిన సుమారు 40 మంది యువకులు భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీలో చేరారు. మాజీ కో-ఆప్షన్ సభ్యులు నాజియా జావిద్ ఖాన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ చేరికల కార్యక్రమం పీర్జాదిగూడ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ జక్క వెంకట్ రెడ్డి యువతకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జక్క వెంకట్ రెడ్డి మాట్లాడుతూ… దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే శక్తి యువతలోనే ఉందని అన్నారు.

బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని పేర్కొన్నారు. అలాగే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ యువతకు ఉపాధి, ఆవిష్కరణలు, స్టార్టప్‌లకు ప్రాధాన్యత కల్పిస్తూ టీ-హబ్ వంటి అంతర్జాతీయ స్థాయి వేదికలను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. యువత తమ ప్రతిభను ప్రపంచానికి చాటుకునే అవకాశాలను బీఆర్ఎస్ ప్రభుత్వం కల్పించిందని తెలిపారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. రైతులు, యువత, నిరుద్యోగులు, విద్యార్థులు తీవ్ర నిరాశలో ఉన్నారని అన్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రవ్యాప్తంగా యువత మళ్లీ బీఆర్ఎస్ వైపు ఆకర్షితులవుతోందని పేర్కొన్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేస్తున్న పోరాటానికి యువత మద్దతు తెలుపుతోందని, అందుకే పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్‌లో చేరుతున్నారని జక్క వెంకట్ రెడ్డి అన్నారు. అనంతరం పార్టీలో చేరిన యువకులు మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధి, యువత భవిష్యత్తు కోసం బీఆర్ఎస్‌తో కలిసి పనిచేస్తామని, పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్  ప్రధాన కార్యదర్శి ఏడవల్లి రఘువర్ధన్ రెడ్డి, సీనియర్ నాయకులు లేతాకుల రఘుపతి రెడ్డి,మాజీ కార్పొరేటర్లు కొల్తూరిమహేష్, మధుసూదన్ రెడ్డి, కౌడేపోచయ్య, మహిళా అధ్యక్షురాలు నిర్మల, మైనారిటి అధ్యక్షులు జిలాని పాషా, ఆకుల మధుకర్, శ్యామల శ్రీనివాస్ స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.