28 March, 2026 | 8:36 PM

వరి ధాన్యం కొనుగోళ్లకు సిద్ధం కావాలి

28-03-2026 06:28 PM

నిర్మల్,(విజయక్రాంతి): యాసంగి వరి ధాన్యం కొనుగోలు కొరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని తన ఛాంబర్ లో యాసంగి (రబీ) వరి ధాన్యం కొనుగోలుకు సంబంధించి సంబంధిత అధికారులతో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జిల్లాలో నిర్ణీత సమయానికి వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను ప్రారంభించి, గడువులోగా పూర్తి చేయాలని అన్నారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభానికి సంబంధించి తగిన ఏర్పాట్లను తక్షణమే పూర్తిచేయాలని పేర్కొన్నారు.

ధాన్యాన్ని అమ్మేందుకు వచ్చే రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని, ప్రతి కొనుగోలు కేంద్రం వద్ద టెంటు, త్రాగునీరు, తదితర వసతులు కల్పించాలని వివరించారు. ఎక్కడ కూడా వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. తగినన్ని ధాన్యపు సంచులు, తూకపు, తేమ యంత్రాలు, టార్పాలిన్లు తగిన సంఖ్యలో అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా సరఫరాల శాఖ అధికారి రాజేందర్, పౌరసరఫరాల మేనేజరు సుధాకర్, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.