21 June, 2026 | 7:01 PM

భక్త జన సంద్రంగా యాదగిరి క్షేత్రం

21-06-2026 04:54 PM

భక్తులతో నిండిన యాదగిరి కొండ (క్షేత్రం)

కొండ కింద రింగురోడ్డులో ఎటు చూసినా వాహనాలే

ధర్మ దర్శనానికి మూడు గంటలు, స్పెషల్ దర్శనానికి రెండు గంటలు

యాదగిరిగుట్ట,(విజయక్రాంతి): యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు వేల సంఖ్యలో తరలి వచ్చారు. వేకువ జాము నుండి రాత్రి వరకు భక్తులతో క్రిక్కిరిసిపోయిన యాదగిరి కొండ. శనివారం సాయంత్రం నుండే వాహనాల రద్దీతో యాదగిరిగుట్టలో రద్దీ నెలకొంది. ఆదివారం ఉదయం నుండి రాత్రి వరకు యాదగిరి కొండ భక్తులతో కిటకిటలాడింది. చెదురు ముదురు వర్షం పడుతున్న భారీ సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.

కొండపైన తిరువీధులలో భక్తుల సందడి నెలకొంది. దర్శనం క్యూలైన్లలో ప్రసాద విక్రయశాలలో భక్తులు బారులు తీరారు. ధర్మ దర్శనానికి మూడు గంటలు, స్పెషల్ దర్శనానికి రెండు గంటల సమయం పట్టింది. కొండ కింద రింగురోడ్డు వాహనాలతో క్రిక్కిరిసిపోయింది. కొండపైన వాహనాలు రద్దీ పెరగడంతో కొండపైకి వాహనాలను అనుమతించలేదు.

కొండ కింద కొత్త బస్టాండ్ నుంచి కొండపై వరకు ఆర్టీసీ బస్సుల కోసం భక్తులు వేచి ఉన్నారు. భక్తుల రద్దీ దృశ్య దేవస్థానం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. స్వామి వారి దివ్య క్షేత్రంలో నిత్య పూజా కైంకర్యాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామివారి నిత్య కళ్యాణం లో భక్తులు పాల్గొన్నారు స్వామివారిని దర్శించుకుని పునీతులయ్యారు. కొండపైన అనుబంధ ఆలయం శ్రీ రామలింగేశ్వర శివాలయంలో నిత్య కైంకర్యాలను పండితులు నిర్వహించారు.