ఆదివాసి సంస్కృతి, సంప్రదాయాల నడుమ ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకలు
- తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలో ఘనంగా నిర్వహణ
- సంప్రదాయ వేషధారణలతో ఆకట్టుకున్న విద్యార్థులు
- ఆదివాసి సంస్కృతి పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత
- ప్రధానోపాధ్యాయుడు చౌహన్ కిషన్
ఇచ్చోడ, (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా(Adilabad District) ఇచ్చోడ మండల కేంద్రంలోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలో ప్రపంచ ఆదివాసి దినోత్సవ(World Tribal Day Celebrations) వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఆదివాసుల సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, జీవన విధానాన్ని ప్రతిబింబించేలా నిర్వహించిన కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా విద్యార్థులు ఆదివాసి సంప్రదాయ వేషధారణలో పాల్గొని తమ సంస్కృతిని చాటిచెప్పారు. గిరిజనుల జీవన విధానం, ప్రకృతితో వారికి ఉన్న అనుబంధం, సంప్రదాయాలు, కళలు, నృత్యాల విశిష్టతను తెలియజేసే కార్యక్రమాలను ప్రదర్శించారు.
విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు పలువురిని ఆకట్టుకున్నాయి. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చౌహన్ కిషన్ మాట్లాడుతూ ఆదివాసుల సంస్కృతి, సంప్రదాయాలు మన సమాజానికి అమూల్యమైన వారసత్వమని పేర్కొన్నారు. ప్రకృతితో మమేకమై జీవిస్తూ జల, జంగల్, జమీన్ పరిరక్షణకు ఆదివాసులు అందిస్తున్న సేవలు గొప్పవని అన్నారు.
విద్యార్థులు ఆదివాసి చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. ఆదివాసుల హక్కులు, వారి ప్రత్యేక జీవన విధానం, భాషలు, కళలు, సంప్రదాయాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా ఆదివాసి సమాజానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.






