7 March, 2026 | 8:33 AM

మహిళలు విద్య, సాంకేతిక రంగాలలో ముందుకు రావాలి

07-03-2026 12:00 AM

ఘట్ కేసర్, మార్చి 6 (విజయక్రాంతి): మహిళలు విద్య, సాంకేతిక రంగాలలో ముందుకు రావాలని కొమ్మూరి ప్రతాపరెడ్డి ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ స్ట్రాటజీ కొమ్మూరి దివ్యశ్రీ అన్నారు. ఘట్ కేసర్ సర్కిల్ ఘనాపూర్ లోని కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ కళాశాలలో శుక్రవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ ప్రత్యేక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి జపాన్కు చెందిన ఎల్‌ఎస్ పార్ట్నర్స్ సంస్థ సీఈఓ సయూరి మత్సునో ముఖ్యఅతిథిగా హాజరై మహిళల సాధికారత, నాయకత్వం, ప్రపంచవ్యాప్తంగా మహిళలు సాధిస్తున్న విజయాల గురించి విద్యార్థులకు ప్రేరణాత్మక ప్రసంగం చేశారు. గౌరవ అతిథిగా వే-హబ్ సంస్థలో సోషల్ ఇంపాక్ట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ప్రోగ్రాం అసోసియేట్ డైరెక్టర్ ఉహా సజ్జా పాల్గొని యువతలో ఆవిష్కరణాత్మక ఆలోచనలు, మహిళా వ్యాపారాభివృద్ధి అవకాశాలపై వివరించారు.

ఈ సందర్భంగా డైరెక్టర్ స్ట్రాటజీ శ్రీమతి కొమ్మూరి దివ్యశ్రీ మాట్లాడుతూ మహిళలు విద్య, సాంకేతిక రంగాలలో ముందుకు రావడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తాయని తెలిపారు. ఎడ్యుకేషనల్ సొసైటీ డైరెక్టర్ ప్రొఫెసర్ బి. సుధీర్ ప్రేమ్ కుమార్, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. శ్రీనాథ్ కాశ్యప్, కెప్రిట్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ ప్రిన్సిపాల్ డాక్టర్ కె. శ్రీనివాస రెడ్డి కూడా ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో డీన్ కార్పొరేట్ రిలేషన్స్ అనీష్ శ్రీవాస్తవ, అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈసందర్భంగా మహిళా సాధికారతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ఉత్తమ విద్యార్థినులు, అధ్యాపకులను సత్కరించారు.