చర్ల కేజీబీవీ పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యే డా. తెల్లం వెంకట్రావు
విద్యార్థినులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఆదేశం
చర్ల,(విజయక్రాంతి): చర్ల మండల పర్యటనలో భాగంగా కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ) భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు సందర్శించారు. కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు చీమలమర్రి మురళి ఆధ్వర్యంలో పాఠశాలలో విద్యార్థినులకు అందుతున్న విద్య, వసతి, భోజనం, తాగునీరు, పారిశుద్ధ్యం, భద్రత తదితర సౌకర్యాలను ఎమ్మెల్యే పరిశీలించారు.
అనంతరం సమీక్ష నిర్వహించారు. విద్యార్థినులతో ఆప్యాయంగా ముచ్చటించిన ఎమ్మెల్యే, వారి విద్యాభ్యాసం, సమస్యలు, అవసరాల గురించి తెలుసుకున్నారు. మరింత శ్రద్ధగా చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని విద్యార్థినులకు సూచించారు. పాఠశాల అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతుల కల్పనకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించి తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.






