హైదరాబాద్‌లో మహిళల హాకీ వరల్డ్ కప్ క్వాలిఫయర్స్
- గచ్చిబౌలీ స్టేడియంలో మ్యాచ్‌లు
- ఇప్పటికే నగరానికి చేరుకున్న పలు జట్లు
హైదరాబాద్, మార్చి 1 : క్రీడా రాజధాని హైదరాబాద్ మరో ప్రతిష్టాత్మక ఈవెంట్‌కు వేదిక కానుంది. మహిళల హాకీ వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ 2026కు గచ్చిబౌలీ స్టేడియం ఆతిథ్యమిస్తోంది. ఎఫ్‌ఐహెచ్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఈ మెగాటోర్నీ కోసం తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిం ది. మార్చి 8 నుంచి 14 వరకూ జరగనున్న ఈ పోటీల్లో మొత్తం 8 దేశాలు పాల్గొంటున్నాయి.
ఆతిథ్య భారత్‌తో పాటు ఆస్ట్రియా, ఇంగ్లాండ్, ఇటలీ, కొరియా, స్కాట్లాండ్, ఉరుగ్వే, వేల్స్ జట్లు తలపడబోతున్నాయి. ఇటీవలే ఆధునీకరించిన గచ్చిబౌలీ హాకీ స్టేడియంలో ఇప్పటికే అన్ని జట్లు ప్రాక్టీస్ కూడా ప్రారంభించాయి. అటు శంషాబాద్ ఎయిర్‌పోర్టు చేరుకున్న భారత మహిళల హాకీ జట్టు కు శాట్స్ అధికారులు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. తెలంగాణ క్రీడాశాఖ ప్రతిష్టాత్మక టోర్నీకి అత్యున్నత భద్రతా ఏర్పాట్లు చేసింది.
ఎఫ్‌ఐహెచ్ అధికారులతో పాటు శాట్స్ అధికారులు, క్రీడాశాఖ అధికారులు సమన్వయం చేసుకుంటూ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. పోటీల ప్రారంభోత్సవం రోజు న తెలంగాణ సంస్కృతి, వారసత్వాన్ని ప్రతిబింబించేలా ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు.




