1 March, 2026 | 6:22 AM

ఈడెన్ లో డూ ఆర్ డై

01-03-2026 12:00 AM

విండీస్‌తో భారత్ కీలకపోరు

గెలిచిన జట్టుకు సెమీస్ బెర్త్

బౌలింగ్‌పైనే కాస్త టెన్షన్

పరుగుల వరద ఖాయం

టీ20 ప్రపంచకప్ లో మరో రసవత్తర పోరు.. సూపర్ 8లో చివరి మ్యాచ్ కు రెడీ అయిన భారత్ విండీస్‌తో తాడోపేడో తేల్చుకోనుంది. ఇరు జట్లకు ఈ మ్యాచ్ క్వార్టర్ ఫైనల్.. ఎవరు గెలిస్తే వాళ్లు ముందుకు.. ఓడిన వాళ్లు ఇంటికి... జింబాబ్వేపై విజయంతో భారత్ కాన్ఫిడెంట్‌గానే ఉన్నప్పటకీ బౌలింగ్ బలహీనతలు బయటపడ్డాయి. హిట్టర్లతో నిండిన విండీస్‌ను మన బౌలర్లు ఎంతవరకూ అడ్డుకుంటారనే దానిపైనే సెమీస్ బెర్త్ ఆధారపడి ఉంది.

కోల్‌కత్తా, ఫిబ్రవరి 28 : ఐసీసీ టీ20 ప్రపంచకప్ లో సూపర్ 8 గ్రూప్ 1లో రెండో సెమీఫైనల్ బెర్త్ ఎవరిదనేది ఆదివారమే తేలబోతోంది.  కోల్ కత్తా ఈడెన్ గార్డెన్స్ వేదికగా వెస్టిండీస్ , భారత్ తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సెమీస్ బెర్త్ దక్కించుకోనుండగా.. ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. సొంతగడ్డపై భారత జట్టునే ఫేవరెట్‌గా చెబుతున్నా టీ20ల్లో వెస్టిండీస్‌ను మరో జట్టుతో పోల్చి చూడలేం.

ఎందుకంటే పొట్టి క్రికెట్ అంటేనే కరేబియన్ క్రికెటర్లకు పూనకం వచ్చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న లీగ్స్‌లో వారిదే హవా. గతంతో పోలిస్తే గేల్ , రస్సెల్, బ్రావో వంటి స్టార్లు లేకున్నా యువ క్రికెటర్లు చాలా మంది అదరగొడుతున్నారు. అందుకే టీమిండియా విండీస్‌ను తేలిగ్గా తీసుకునే పరిస్థితి లేదు. తనదైన రోజున కరేబియన్లు ఏ జట్టునైనా మట్టికరిపిస్తారు. ప్రస్తుతం భారత్ బ్యాటింగ్ పరంగా ఫామ్ అందుకుంది.

జింబాబ్వేతో మ్యాచ్ లో సంజూ శాంసన్ పెద్ద ఇన్నింగ్స్ ఆడకున్నా పర్వాలేదనిపించాడు. మిగిలిన బ్యాటింగ్ లైనప్‌లో అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ , సూర్యకుమార్, హార్థిక్ పాండ్యా, తిలక్ వర్మ ఫా మ్ లోకి వచ్చేశారు. దీంతో వీరి నెలకొల్పే భాగస్వామ్యాలపైనే భారత్ భారీస్కోరు ఆధారపడి ఉంటుంది. అంతకుముందు సౌతాఫ్రికా చేతిలో పరాజయానికి సరైన భాగస్వామ్యాలు లేకపోవడ మే కారణం. దీంతో విండీస్‌పై దీనిని అధిగమిస్తే భారీ స్కోరు చేయగలుగుతుంది. తుది జట్టు కూర్పు విషయానికొస్తే మార్పులు జరిగే అవకాశాలు కనిపించడం  లేదు.

ఓపెనర్లుగా అభిషేక్, సంజూలనే కొనసాగిం చడం ఖాయం. సంజూ విం డీస్‌పై భారీ ఇన్నింగ్స్ ఆడాలని టీమ్ కోరుకుంటోంది.  కా గా ఈ మ్యాచ్‌లో రింకూ సింగ్ బెంచ్ కే పరిమితమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తండ్రి అంత్య క్రియల్లో పాల్గొని కొన్ని గంటలకే మళ్లీ టీమిండియాతో చేరాడు. అయితే జింబాబ్వేతో మ్యాచ్ కాంబినేషన్‌ను మార్చే ఛాన్స్ లేనట్టే. దీంతో ఫినిషర్ రోల్‌లో తిలక్ ఉండే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు బౌలింగ్ పరంగా కొన్ని ఇబ్బందు లున్నాయి. గత మ్యాచ్‌లో  మన బౌలింగ్ చెప్పుకోదగినవిధంగా లేదు.

నిజం చెప్పాలంటే ఈ టోర్నీలో మన బౌలింగ్ అంచనాలకు తగ్గట్టుగా లేదన్నది అంగీకరించాల్సిందే. పేస్ ఆల్ రౌండర్లు పాండ్యా, దూబే భారీగా పరుగులిచ్చేస్తున్నారు. జింబాబ్వేపై కూడా వీరి బౌలింగ్ తేలిపోయింది. ఇప్పు టు టీ20 హిట్టర్లున్న వెస్టిండీస్ పై వీరు అంచనాలకు తగ్గట్టు రాణించకుంటే కష్టమే. ఎట్టి పరిస్థితుల్లోనూ వెస్టిండీస్‌ను 200 పరుగుల లోపే కట్టడి చేస్తేనే విజయంపై ఆశలు పెట్టుకోగలం.

మరోవైపు వెస్టిండీస్ బ్యాటింగ్ లైనప్ భీకరంగానే కనిపిస్తోంది. బ్రాండన్ కింగ్, షైహోప్, షిమ్రన్ హ్టుమైర్, రోవ్మన్ పోవెల్ విధ్వంసకర ఇన్నింగ్స్ లు ఆడే సత్తా ఉన్నవారే. పైగా మ్యాచ్‌కు ఆతిథ్యమిస్తున్న ఈడెన్ గార్డెన్స్ పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలం. ఇలాంటి పిచ్‌పై విండీస్ హిట్టర్లను ఆపడం అంత ఈజీ కాదు. ఈ నేపథ్యంలో బౌలింగ్ ఖచ్చితంగా అంచనాలకు తగ్గట్టు ఉండాల్సిందే.

పిచ్ రిపోర్ట్ 

ఈడెన్ గార్డెన్స్ సహజంగానే బ్యాటర్లకు అనుకూలం. భారత్, విండీస్ మధ్య కీలక పోరు కావడంతో ఫ్లాట్ వికెట్ నే రూపొందించారు. పిచ్ పై గంగూలీ, బీసీసీఐ హెడ్ క్యూరేటర్ సైతం ప్రత్యేకంగా దృష్టి సారించినట్టు తెలుస్తోంది. 

తుది జట్లు అంచనా :

భారత్ : అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, సూర్యకుమార్(కెప్టెన్), హార్థిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్షదీప్‌సింగ్, బుమ్రా, వరుణ్ చక్రవర్తి

వెస్టిండీస్ : బ్రాండన్ కింగ్, షై హోప్ (కెప్టెన్), హెట్‌మెయిర్, రోవ్‌మన్ పావెల్, రోస్టన్ ఛేజ్, రూథర్‌ఫర్డ్, జాసన్ హోల్డర్, మాథ్యూ ఫోర్డ్, గుడకేశ్ మోటి, షమర్ జోసెఫ్