27 May, 2026 | 1:29 AM

ఖానాపూర్‌లో మహిళ హత్య!

27-05-2026 12:36 AM

పంట అవశేషాల్లో వేసి మృతదేహానికి నిప్పు

దారిలో రక్తపు మరకలు 

బిజినేపల్లి మే 26: మొక్కజొన్న పంట అవశేషాల్లో ఒక గుర్తు తెలియని మహిళ మృతదేహం మండలంలోని ఖానాపూర్ గ్రామ శివారులో మంగళవారం వెలుగు చూసింది. పంట ఆవశేషాల్లో మహిళకు చెందిన ఆభరణాలను స్థానికులు గుర్తించారు. పొలానికి వెళ్ళే దారిలో అక్కడక్కడ రక్తపు మరకలను కూడా వారు గుర్తించారు.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఖానాపూర్ గ్రామానికి చెందిన రైతులు గ్రామ పెద్దలతో కలిసి  తమ శివారులోని పాలెం వ్యవసాయ కళాశాలకు సమీపంలో పొలం కొలతలు కొలవడానికి వెళ్ళారు. వారికి మొక్కజొన్న పంట అవశేషాల బూడిదలో ఒక కాలిపోయిన మృతదేహం  నుండి పొగ రావడం గుర్తించారు. బూడిదలో ఎముకలు, కొన్ని కాలిపోయిన ఆభరణాలు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు తమ క్లూస్ బృందంతో ఘటన స్థలాన్ని పరిశీలిస్తున్నారు.

దుండగులు ఒక గుర్తు తెలియని మహిళను హత్య చేసి, మొక్కజొన్న పంట అవశేషాలల్లో వేసి కాల్చి ఉంటారని పలువురు అనుమానిస్తున్నారు. ఆభరణాల ఆధారంగా మహిళ వయస్సు 25-40 సంవత్సరాల మధ్య ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. పొలానికి వెళ్ళే దారిలో ఆ మహిళకు చెందిన ఎండిపోయిన తాజా రక్తపు మరకలను గుర్తించారు. కాగా పోలీసులు మృతదేహం గుర్తించే పనిలో పడ్డారు. మృతదేహాన్ని గుర్తిస్తే  నిందితులను పట్టుకోవచ్చన్నారు.