పుట్టెడు దుఃఖంతో..
కన్నవారి మరణం దిగమింగుకుని టెన్త్ పరీక్షలకు హాజరైన విద్యార్థులు వీరు
శివంపేట/గుండాల (మోత్కూరు), మార్చి 14 (విజయక్రాంతి): తెల్లవారితే పరీక్ష.. అందునా తమ భవిష్యత్‌కు చదువుల సోపానంలో కీలకమైన పదో తరగతి పరీక్ష. టెన్షన్.. టెన్షన్.. ఈ పరిస్థితుల్లో దురదృష్టవశాత్తు కన్నవారు హఠాత్తుగా మరణిస్తే ఆ గుండెగుబులు వర్ణనాతీతం. అంతటి పుట్టెడు దుఃఖాన్ని దిగమింగుకొని మూడు వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు విద్యార్థులు పది పరీక్షలకు హాజరజయ్యారు.
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీకి చెందిన కూరెళ్ల ఎల్లయ్య గుండాల మండలంలోని వస్తాకొండూర్ గ్రామం లో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. శుక్రవారం రాత్రి గుండెపోటు రావడంతో నల్లగొండలోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌కు తరలిస్తుండగా మృతిచెందాడు.
ఆ కుటుంబం విషాదంలో మునిగిపోగా, తండ్రి ఆశయాన్ని నెరవేర్చడానికి కన్నీళ్లను ఆపుకొని పది పరీక్షలకు హాజర య్యాడు ఆయన కుమారుడు హర్షవర్ధన్. పదవ తరగతిలో మంచి మార్కులు సాధించి తండ్రికి అంకితం ఇస్తానని బరువెక్కిన హృదయంతో ఆ విద్యార్థి తెలపడం గమనార్హం.
మెదక్ జిల్లాలో..
మెదక్ జిల్లా శివ్వంపేట మండలంలోని పాంబండ గ్రామానికి చెందిన కుమ్మరి నాగరాజు (45) మేస్త్రీ. అతని భార్య అంజమ్మ కూలీ పనులు చేస్తుంటుంది. నాగరాజు దంపతులకు ముగ్గురు మగ సంతానం. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం నల్లవల్లి గ్రామంలో బంధు వుల దశ దినకర్మకు శుక్రవారం అంజమ్మ వెళ్లింది. సాయంత్రం నాగరాజు వెళ్లి బైక్‌పై ఇంటికి వస్తున్న క్రమంలో ఉసిరికపల్లి కొట్టాల వద్ద బైక్ అదుపుతప్పి కిందపడి, నాగరాజుల తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు.
శనివారం నాగరాజు అంత్యక్రియలు జరగాల్సిఉండగా తూప్రాన్‌లో సేయింట్ అండ్రీవ్స్ పాఠశాలలో పదో తరగతి పూర్తిచేసుకున్న అతని రెండో కొడుకు ధనుష్, శనివారం విధిలేని పరిస్థితిలో కన్న తండ్రి శవాన్ని విడిచి పరీక్ష రాయడానికి వెళ్లడంతో అక్కడున్న వారంతా కన్నీటిపర్యంతమయ్యారు.
ఖమ్మం జిల్లాలో..
ఖమ్మం జిల్లా కల్లూరు మండలం బత్తులపల్లిలో పదో తరగతి విద్యార్థి గండేపల్లి మణికంఠ తండ్రి కొండలరావు శుక్రవారం తెల్లవారు జామున అనారోగ్యంతో మృతి చెందాడు. ఆ బాధను దిగమింగుకొని శనివారం మణికంఠ పరీక్షకు హాజరయ్యాడు.




