13 May, 2026 | 3:13 AM

అమ్యామ్యాలిస్తే అలకటి పనులు..?

13-05-2026 12:05 AM
  1. తాబేదారులకు రాచమర్యాదలు...
  2. బిర్యాణిలు, కాళ్ళు తలకాయ కర్రీల కానుకలు...
  3. అధికారుల మరో అవినీతి కోణం

బెల్లంపల్లి, మే 12 : పురాతన భూగర్భ గనిలో పని చేయాలంటే కాసింత కష్టమే.. సీనియర్ కార్మికులు ఎలాంటి కష్టాలనైనా భరిస్తారు.., భరిస్తున్నారు... కొత్తగా వచ్చిన కార్మికుల బాధలు వర్ణనాతీతం... ఈ పరిస్థితిని కొందరు అధికారులు ఆసరా చేసుకున్నారు. కార్మికుల బలహీనతను సొమ్ము చేసుకుంటున్నారు. అందుకని కొత్తగా వసూళ్ల అకౌంట్ ను తెరిచారు. ఈ అవినీతి దందా మూడు పూలు ఆరు కాయలుగా వర్ధిల్లుతుంది.

ఇంతకి వసూళ్ళ ఖాతాను ఓపెన్ చేసిన ఘనులు ఎక్కడివారో కాదు.. శాంతిఖని అధికారులే... ఇప్పటి వరకూ కార్మికులను రాచిరంపాన పెట్టడమే అధికారులకి తెసునీ అనుకున్నారు, కానీ అధికారుల్లో మరో అవినీతి కోణం కూడా బయట పడింది... సర్ఫేస్ పనుల్ని ఆదాయ మార్గంగా మలుచుకున్నారు. అండర్ గ్రౌండ్ లో పనిచేయడం ఎంతో వ్యయప్రయాసం కాగా గనిలో దిగిపనిచేయడం అత్యంత కష్టమైన నరకప్రాయం.. అందుకని అడిగింత ముట్టచెప్పి ఆలకటి పనులు సంపాదించుకోవడమే ఉత్తమంగా భావించారు... ఇలా చేయడం వల్ల శ్రమ తప్పుద్ది.., ఉద్యోగాలు దక్కుతాయి... ఎలాంటి శ్రమ లేకుండా పూర్తి మాస్టర్లతో పూర్తి వేతనం పొందవచ్చుననీ కొందరి సౌఖ్యం.

ఈ పరిస్థితి మరోవిధంగా అధికారులకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ నేపథ్యంలో గని ఉపరితలం పనులకు ఒక రేటు, అండర్ గ్రౌండ్ లో సర్ఫేస్ పనులకు మరోక రేటు నిర్దేశించారు. అలకటీ పనులకు రూ. 50 వేల నుంచి లక్ష వరకు రేటు పలుకుతోంది. ఇది అధికారులకు ఎంతో లాభదాయకంగా మారింది. ఈ దందాతో రెండు చేతులతో సంపాదన గడిస్తున్నారు. ఒక్కో అధికారికి 2 నుంచి రూ. 3 లక్షల రూపాయల వేతనం ఉంటుంది. అది సరిపోదన్నట్టు ఈ వసూళ్ళతో లక్షలు వారి ఖాతాలోకి చేరుతున్నాయి.

సర్ఫేస్ పనులను అందరికీ ఇవ్వరూ.., తాబేదార్ల రికమండేషన్ తోనే సర్ఫేస్ పనులు కల్పిస్తారు. ఎంతో మంది సీనియర్ కార్మికులు గనిలో రెక్కలు ముక్కలు చేసుకుని పనిచేస్తుంటారు. ఎప్పుడైనా బలహీనంగా ఉన్నప్పుడు, ఆరోగ్యం బాగోలేనప్పుడు ఒక రోజు రెస్టు అడిగినా, సర్ఫేస్ పని కల్పించమని వేడుకున్నా అధికారులు కనికరించరు... అర్హులకు ఎప్పుడూ మొండి చెయ్యి చూపుతారు. అదే లంచాలు ముట్ట చెప్పిన వారిని అధికారులు కానీ చెప్పకుండా పోషిస్తున్నారు.

అండర్ గ్రౌండ్లో, ఉపరితలంలో ఇలా పైరవీలతో సర్ఫేస్ పనుల్లో 30 మందికి పైగానే ఉంటారని సమాచారం. వారికి ప్లే డేలు, పీహెచ్డీలూ అధికారులు సమకూరుస్తారు. అడిగినప్పుడల్లా మాస్టర్ రెస్టులు ఇస్తుంటారు. తాబేదారులూ అతిథుల్లా విధులకు వస్తుంటారు. అధికారులకు సర్వచాకిరి ఎవరో దళారులు చేయడం లేదు. ప్రధాన కార్మిక సంఘాల లీడర్లమని చెప్పుకుంటున్న వారే చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. వారి కనుసన్నల్లోనే సర్ఫేస్ కోసం ముడుపుల వసూళ్లు జరుగుతున్నాయి.

అధికారుల ఆలనా పాలనా దగ్గరుండి వారే చూస్తుంటారు. శాంతిఖనిలో కొందరికి పనిచేసే డిసిగ్నేషన్లు లేకున్నప్పటికీ గనిలో పని కల్పిస్తున్నారని కార్మికులు బాహాటంగానే చర్చించుకుంటున్నారు. లీడర్ల ముసుగులో అధికారులకు సేవలు అందిస్తూ, చెమట రాల్చకుండా వేతనాలు పొందుతున్నారు. సోమరిపోతులను ఆదరిస్తూ, అధికారులు తమ ఉద్యోగ విధులను దుర్వినియోగానికి పాల్పడుతున్నారన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

- జోరుగా విందులు.. జల్సాలు...

శాంతిఖనిలో అధికారుల అవినీతికి, జల్సాల కు అడ్డూ అదుపులేకుండా పోయిందన్న విమర్శలున్నాయి. శాంతిఖనిలో తాబేదారుల గుంపు ఒకటి తయారైంది. ఆ గుంపు అధికారుల అవసరాలని తీర్చడమే ప్రధాన విధిగాపెట్టుకున్నారు. విందులు, వినోదాలు, మందు పార్టీలను ఏర్పాటు చేసి అధికారులను రంజింపచేస్తున్నారు. ఇలా అధికారులపై తమ ప్రభు భక్తిని చాటుకుంటున్నారు.. బిర్యాణి, కాళ్ళు తలకాయ, చికెన్, మటన్ ప్రత్యేక వంటకాలు తయారీ చేసి బాయి దొరలను ఖుషీ చేస్తున్నారు... ఇలా మందు పార్టీలివ్వడం నిత్యకృత్యంగా మారిపోయింది.

అధికారులు, వారి సేవకులు సుఖాలలో మునిగి తేలియాడుతున్నారు. సామాన్య కార్మికులు గనిలో దిగి నిత్యం అష్టకష్టాలు పడుతుంటారు. పలుకుబడి కలిగిన వ్యక్తులు, లీడర్ల అండదండలతో కొందరూ మాత్రం గనిలో సాఫీగా కాలం వెళ్లదీస్తున్నారు. అధికారుల ఆగడాలు ఇంత జరుగుతున్నా విజిలెన్స్ అధికారుల దృష్టికి వెళ్లకపోవడం ఆశ్చర్యం కలగక మానదనీ పలువురు అభిప్రాయ పడుతున్నారు.