దోమకొండలో డిగ్రీ కళాశాల ఈ ఏడాదైనా ప్రారంభమయ్యేనా?
- అఖిలపక్షం ఆందోళన చేసిన హామీలతోనే కాలం వెళ్లబుచ్చిన పార్టీల నాయకులు
విద్యార్థులకు అందని డిగ్రీ విద్య
ఈ విద్యా సంవత్సరమైనా ప్రారంభానికి నోచు కునేనా
విద్యార్థి సంఘాల ఆశాభావం
కామారెడ్డి, ఫిబ్రవరి 24 (విజయక్రాంతి): కామారెడ్డి నియోజకవర్గంలో జిల్లా కేంద్రంలో ఉన్న డిగ్రీ కాలేజీ తో పాటు ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో ఉన్నాయి. ప్రభుత్వ డిగ్రీ కళాశాల పాత తాలూకా ఆయన దోమకొండ మండల కేంద్రంలో ఏర్పాటు చేయాలని గత పది సంవత్సరాల నుంచి విద్యార్థి సంఘాలు, అఖిలపక్ష పార్టీల నాయకులు పోరుబాట పట్టారు. కానీ ఇప్పటికీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు దోమకొండ నోచుకోలేదు.
గతంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం లోని నాయకులు హామీలు ఇచ్చారు తప్ప ప్రభుత్వ డిగ్రీ కళాశాల మాత్రం ఏర్పాటు చేయలేదు. ఎన్నికల ముందు డిగ్రీ కళాశాల ఏర్పాటు చేపిస్తామని పేద విద్యార్థులకు సౌకర్యం కల్పిస్తామని గొప్పలు చెబుతున్న నాయకులు ఎన్నికల తర్వాత మర్చిపోతున్నారు.
10 సంవత్సరాలుగా డిగ్రీ కళాశాల హామీలకే పరిమితం
కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరు చేస్తామని గత పది సంవత్సరాలుగా నాయకులు హామీలు ఇస్తున్నారు. అమలుకు మాత్రం నోచుకోవడం లేదు. దోమకొండ చుట్టూ బిబిపేట్, బిక్కనూర్, మాచారెడ్డి మండలాలు దగ్గరలో ఉన్నాయి. దోమకొండ లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తే నాలుగు మండలాల విద్యార్థులకు డిగ్రీ విద్య అందుబాటులోకి వస్తుంది. ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
నాయకులు పట్టించుకోవడం లేదు. దీంతో ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్య దోమకొండ విద్యార్థులకు అందని ద్రాక్ష లాగా మిగిలింది. ఇప్పటికైనా అధికారులు నాయకులు స్పందించి దోమకొండలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు, దోమకొండ మండల ప్రజలు కోరుతున్నారు. ఇకనైనా హామీలు ఇచ్చిన నాయకులు ప్రభుత్వ డిగ్రీ కళాశాలను మంజూరు చేయించి భవనాన్ని నిర్మించి విద్యార్థులకు విద్యను అందుబాటులోకి తేవాలని కోరుతున్నారు. గురుకుల డిగ్రీ కళాశాల ఉంది కానీ అందులో అడ్మిషన్ కావాలంటే ప్రవేశ పరీక్ష రాసిన వారికే అవకాశం ఉంటుంది.
ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తే పేద ప్రజలకు డిగ్రీ విద్య అందుబాటులోకి రావడమే కాకుండా విద్యార్థినీలకు విద్యార్థులకు అందుబాటులో ఉంటుందని విద్యార్థి సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయకుంటే ప్రభుత్వంపై పోరాటం చేయడమే కాకుండా రిలే నిరాహార దీక్ష కార్యక్రమాలను చేపడతామని విద్యార్థి సంఘాల నాయకులు పేర్కొన్నారు.
నాయకుల హామీలే తప్ప కళాశాల రాలేదు
కామారెడ్డి జిల్లా దోమకొండ పాత తాలూకా కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయలేదు. విద్యార్థి సంఘాలు అఖిలపక్ష ఆధ్వర్యంలో ఎన్నో రోజులు రిలే నిరాహార దీక్షలు నిర్వహించిన నాయకులు హామీలు ఇచ్చారు తప్ప ఇప్పటివరకు మంజూరు చేయలేదు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరు చేయకపోవడంతో పాటు కళాశాల భవనం నిర్మించకపోవడంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు.
- బండారి శంకర్, దోమకొండ
పేద విద్యార్థుల భవిష్యత్తు కు కళాశాల ఎంతో అవసరం
కామారెడ్డి జిల్లా దోమకొండ లో పేద విద్యార్థులకు డిగ్రీ చదువుకునేందుకు కళాశాల అవసరమని ప్రభుత్వం వెంటనే ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరు చేసి కళాశాల భవనం నిర్మించేలా స్థానిక ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డితో పాటు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ కృషి చేయాలన్నారు. గతంలో ఎన్నికల ముందు హామీ ఇచ్చారని , హామీని నెరవేర్చాలని కోరారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల పేద విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు.
- గాజులపల్లి కాశిరెడ్డి, దోమకొండ




