క్విడ్ ప్రోకోలో అజ్ఞాత వ్యక్తి ఎవరు!
- నేతల ఉచ్చులో నలిగిన గిరిజనం
- అక్రమ వెంచర్ మోసలతో రోదిస్తున్న వట్టెం ముంపు బాధితులు
- ప్రశ్నిస్తే బెదిరింపులు, దాడులు
- నోరు మెదపని ప్రధాన పార్టీలు
బిజినేపల్లి మే 11. ప్రాజెక్టు నిర్మాణం కోసం ఇల్లు వాకిలి వ్యవసాయ భూమితో పాటు సర్వం కోల్పోయిన నిర్వాసిత రైతులను గత పాలకులు ప్లాటు స్థలాల పేరుతో నమ్మించి నట్టేట ముంచారు. పరిహారం డబ్బులందేందుకు సహకరించామని తమ ప్లాట్లను మాత్రమే కొనుగోలు చేయాలని క్విడ్ ప్రోకో కింద డీల్ కుదుర్చుకున్నారు. అది నమ్మి ప్లాట్లు కొనుగోలు చేసిన దళిత గిరిజన రైతులకు అసలు విషయం బయటపడడంతో నిండా మోసపోయామని గగ్గోలు పెడుతున్న పరిస్థితి.
ఈ వ్యవహారంలో కందనూలులోక్విడ్ ప్రాకో అనే వార్త కథనాన్ని విజయాక్రాంతి ఈ నెల 10న ప్రచురించింది. దీంతో మోసపోయిన దళిత గిరిజన రైతులంతా ధైర్యంతో ఒకటయ్యారు సోమవారం తమకు న్యాయం చేయాలని కోరుతూ బిజినపల్లి మండల తాసిల్దార్ కు వినతి పత్రం అందించారు. కబ్జా చేసిన భూమిలో అక్రమ వెంచర్ వేసి నకిలీ ప్లాట్లను అంటగట్టిన ఈ డీల్ వెనక అప్పటి అధికార పార్టీ లీడర్లతోపాటు మరో ప్రధాన సూత్రధారి ఉన్నారని ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరన్న చర్చ ప్రస్తుతం జోరందుకుంది. తమ కన్యాయం జరిగిందని తమ డబ్బులు తమకు ఇవ్వాలని గట్టిగా మాట్లాడిన ప్రతి ఒక్కరిపై దాడులకు తెగబడుతున్నారని గిరిజన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తన భూమిని కబ్జా చేసి అక్రమ వెంచర్లు వేసుకున్నారని బాధితుడు రాజేశ్వర్ రెడ్డి ప్రశ్నించగా తీవ్రంగా గాయపరిచిన విషయం తెలిసిందే ఈ విషయంలోనూ పోలీస్ అధికారులు సైతం కేసులు నమోదు చేయకపోవడం వెనక ఆ అజ్ఞాత వ్యక్తి ప్రమేయం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మోసం చేయడం నాయకుల వంతు, మోసపోవడం గిరిజనుల వంతు అన్న తీరుగా మారిందని గిరిజనులు వాపోతున్నారు. ఇల్లు, వాకిలి, భూమి, జ్ఞాపకాలు ఇలా అన్నింటినీ ప్రభుత్వం లాకుంటే, వెంచర్లలో కొత్త ఇండ్లు అంటూ ఆశ చూపి ఖబ్జా భూమిలో ప్లాట్లు చేసి నిండా ముంచారని అమాయక గిరి పుత్రులు పుట్టెడు దుఃఖంతో ఉన్నారు.
బిజినేపల్లి శివారు 101 సర్వే నెంబర్ లో గంగనమోని కుర్మయ్యకు 2ఎకరాల భూమి ఉంది. కానీ 6.06 ఎకరాల్లో ప్లాట్లు చేసి వట్టెం ముంపు బాధితులకు ఒకొక్క ప్లాటు 2లక్షల నుండి - 2.50 లక్షలకు 9 సంవత్సరాల క్రితం విక్రయించాడు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో ఒకొక్క ప్లాటు ధర 8 లక్షల నుండి 10 లక్షల వరకు పెరిగింది. ఇలా 101 సర్వే నంబర్ లో దాదాపు 130 పైగా ప్లాట్లు విక్రయించాడు. అసలు పట్టాదారులు కోర్టు ద్వారా భూమికి ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకొని మోక మీదకు వచ్చారు. దీంతో గిరిజనుల్లో అసలు ఆందోళన మొదలైంది.
మూడు ప్లాట్లు కొన్నాను.
ప్రభుత్వం ఇచ్చిన పరిహారంతో ఈ నాయకుల మాట నమ్మి మూడు ప్లాట్లు కొన్నాను. ఈరోజు నా ప్లాటుకు వెళ్లి చూస్తే హద్దు రాళ్ళు లేవు. అసలు పట్టాదారు వచ్చి ఇది మా భూమి, మీరు వెళ్ళిపొండి అంటున్నారు. అమ్మిన వ్యక్తిని ప్రశ్నిస్తే అధికార పార్టీ నాయకులతో దాడులకు తెగబడుతున్నారని గిరిజన రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
మౌనంగా ప్రధాన పార్టీలు.
ఎన్నికల సమయంలో ప్రధాన పార్టీలు అన్నీ గిరిజన ఓట్లే లక్ష్యంగా ప్రచారాలు, హామీలు చేస్తుంటారు. కానీ గిరిజనులకు అన్యాయం జరిగిందని పత్రికల్లో వార్తలు, కుల సంఘాలు తమ గొంతు వినిపిస్తుంటే ప్రధాన పార్టీలు నోరు మెదపడం లేదు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుడైన గగనమోని కిరణ్ వారిని మోసం చేస్తే, ప్రస్తుతం అధికార పార్టీలో కీలకంగా ఉన్న అతని సోదరుడు పరస్పర దాడుల్లో ఉన్నారు.
దీంతో ప్రధాన పార్టీలు రెండు కలిసి గిరిజనులకు అన్యాయం చేస్తుంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రేక్షకపాత్ర వహిస్తుంది. ఇక మిగిలిన వామపక్షాలు, చిన్న పార్టీలు సాధారణ సమయాల్లో గిరిజనుల కోసం ఊకదంపుడు ఉపన్యాసాలతో అదరుగొడుతారే కానీ తమను పట్టించుకోవడం లేదని గిరిజన ప్రజలు అంటున్నారు.
కలెక్టరు గారు కాస్త స్పందించండి
సర్వం కోల్పోయిన తమ గిరిజ నులను స్థానిక నాయకులు ఆదుకుంటారు అను కున్నాము. ఇలా మోసం చేస్తారు అనుకోలేదు. మా సమస్యను కలెక్టర్ సుమోటోగా తీసుకొని మా గిరిజనులకు న్యాయం చేయాలని కోరుతున్నాము.
గోపాల్ నాయక్, కారుకొండ తండా సర్పంచి, బిజినేపల్లి






