2 August, 2026 | 4:47 AM

క్రేజీ కల్యాణం థియేటర్లలో విజిల్స్ పక్కా

02-08-2026 12:00 AM

నరేశ్ వీకే, అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, ‘రాజ్ వెడ్స్ రాంబాయి’ ఫేమ్ అఖిల్ ఉడ్డెమారి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘క్రేజీ కల్యాణం’. ఈ చిత్రాన్ని యారో సినిమాస్ బ్యానర్‌పై బూసం జగన్ మోహన్ రెడ్డి నిర్మిస్తున్నారు. దర్శకుడు బద్రప్ప గాజుల రూపొందిస్తున్నారు. శనివారం ఈ సినిమా టీజర్‌ను ప్రముఖ దర్శకురాలు నందినిరెడ్డి రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో డైరెక్టర్ నందిని రెడ్డి మాట్లాడుతూ.. ‘ ‘క్రేజీ కల్యాణం’ టీజర్ చూస్తే థియేటర్స్‌లో విజిల్స్ వేసి ఎంజాయ్ చేసే సినిమా అని తెలుస్తోంది.

ఈ సినిమా 100 కోట్లు వసూళ్లు చేసి హిస్టరీ క్రియేట్ చేయాలని కోరుకుంటున్నా” అన్నారు. హీరో అఖిల్ రాజ్ మాట్లాడుతూ.. “ఈ టీజర్‌లాగే సినిమా కూడా అందరికీ బాగా నచ్చుతుందని నమ్ముతున్నా. అనుపమను పక్కా తెలంగాణ క్యారెక్టర్‌లో చూడబోతున్నారు. నాపై ఎంత నమ్మకం ఉంటే అనుపమతో కలిసి నటించే అవకాశం కల్పించారో అర్థం చేసుకోవచ్చు” అన్నారు. హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ.. “ఇది స్మాల్ అండ్ స్వీట్ ఫిలిం.

ఈ కథ వింటూ నవ్వీ నవ్వీ కడుపు నొప్పి వచ్చింది. ఫిలింమేకింగ్ లో ఒక కొత్త దర్శకుడు భద్రప్ప చూపించిన ప్రతిభకు గర్వపడుతున్నా” అని తెలిపారు. డైరెక్టర్ భద్రప్ప గాజుల మాట్లాడుతూ.. “మనం నిజ జీవితంలో చూసే పాత్రలు, ఇరుగు పొరుగు వ్యక్తులను పోలిన క్యారెక్టర్స్ మా మూవీలో ఉంటాయి. మా చిత్రంలో నవ్వులతో పాటు మనసుకు హత్తుకునే ఎమోషన్స్ ఉన్నాయి” అని చెప్పారు. నిర్మాత బూసం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. “భద్రప్ప నాకు 12 కథలు చెప్పారు.

ఆ కథల్లో ఇది సెలెక్ట్ చేసుకున్నాం. అయితే మిగతా కథలతో కూడా భద్రప్ప మాతో సినిమాలు చేయిస్తాడని అనిపిస్తోంది” అని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో దర్శక నిర్మాత వేణు ఊడుగుల, నటుడు వీకే నరేశ్, మ్యూజిక్ డైరెక్టర్ సురేశ్ బొబ్బిలి, డీవోపీ శ్యామ్ దూపాటి, రైటర్ శ్రీనివాస రవీంద్ర, లిరిక్ రైటర్ గోరటి వెంకన్న, నటీనటులు కూడా మాట్లాడారు.