07-02-2026 01:39:11 AM
విచారణ పొలిటికల్ డ్రామానేనా!
ఫోన్ ట్యాపింగ్ పరికరాలకు అధికారిక రికార్డులు ఏవీ?
హైదరాబాద్, ఫిబ్రవరి 6 (విజయక్రాంతి) : ప్రస్తుతం రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్‌పై జరుగుతున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ.. ఓ పొలిటికల్ డ్రామానేనా!? అంటే, అవుననే రాజకీయ విశ్లేషకు లు, సాంకేతిక రంగ, న్యాయ నిపుణుల నుంచి సమాధానం వస్తోంది. అంతిమంగా ఇదంతా ఒక పొలిటికల్ డ్రామా లాగా మిగిలిపోతుందని రాజకీయ విశ్లేషకులు కుండబ ద్దలు కొట్టినట్టుగా చెబుతుండటంతో.. సిట్ విచారణ కూడా పొలిటికల్ డ్రామాగా మారబోతుందా అనే అనుమానాలు బలపడుతు న్నాయి. అనుమానమేలేదు, జరిగేది ఇంతే అని ఆయా రంగాల నిపుణులు, రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
ప్రభుత్వం ఏదైనా.. పంథా అదే..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైనా.. ప్రత్యర్థులు, ప్రతిపక్షాలు, ప్రధాన నేతలు.. ఇలా అనేక మందికి సంబంధించిన ఫోన్లను ట్యా పింగ్ చేయడం ద్వారా ముందుగానే వారి ఆలోచనలను తెలుసుకుంటాయి. తద్వారా వారికి అడ్డుకట్ట వేసేందుకు వీలుగా వ్యూహా లు పన్ని.. ప్రతిపక్ష నేతలు, కీలక ప్రజాప్రతినిధులు, ప్రత్యర్థులకు చెక్ పెట్టడానికి ‘నిఘా’ వ్యవస్థలను వాడుకుంటున్నాయనే విమర్శ లు ఉన్నాయి.
అయితే ఇది కేవలం బీఆర్‌ఎస్ ప్రభుత్వానికే పరిమితం కాదు.. అనేక రాష్ట్రాల్లో, ఆఖరికి కేంద్రంలోనూ ఇలాగే నిఘా పెట్టే అవకాశాలు కూడా ఉంటాయని నిపుణులు చెబుతుండటం గమనార్హం. అం టే ఇక్కడా, అక్కడా అనే తేడా లేకుండా ప్ర భుత్వాలు ఇలాంటి వ్యవహారాలను గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తుంటాయని స్పష్టమవుతున్నది.
పరికరాలకు అధికారిక ముద్ర ఏదీ?
ఇలాంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలను నడిపించడానికి అత్యంత అధునాతన సాంకేతికత, పరికరాలు కావాల్సి ఉంటుంది. తా జా సంఘటనలో ‘పెగాసస్’ సాంకేతికతను వాడినట్టుగా చెప్పుకుంటున్నారు. ఇలాంటి సాంకేతికత, పరికరాలు ఇజ్రాయెల్‌లో లభిస్తుంటాయి. అయితే, ఇలాంటి పరికరాలను ఏ ప్రభుత్వం కూడా అధికారికంగా తెప్పించుకోజాలదని నిపుణులు అంటున్నారు.
ట్యాపింగ్‌కు ఉపయోగించే పరికరాలను ఇతర పేర్లతో తెప్పించుకుని, కస్టమ్స్ చెల్లించి మరీ ఉపయోగిస్తారని తెలుస్తుంది. అంటే.. ఎక్కడా కూడా ఈ పరికరాలకు సంబంధించిన అధికారిక రికార్డులు ఉండవనే నిఘా వర్గాల నిపుణులు చెబుతున్నారు. ఇంత చేస్తున్నా.. ఏ ప్రభుత్వం కూడా బహిరంగంగా తాము ఇలా నిఘా పెట్టామనే విష యాన్ని చెప్పుకోలేవు.
అధికారికంగా ధ్రువీకరణ ఉండదు..
ఇలా అత్యాధునిక సాంకేతికతో కూడిన పరికరాల ఉపయోగించి.. ఎవరికి సంబంధించిన సమాచారం కావాలనేది పైస్థాయిలో ఉండేవారు ఆదేశిస్తారు. కిందివారు దానిని పాటించి సమాచారాన్ని సేకరిస్తారు. ఇలా సేకరించిన సమాచారాన్ని కూడా అధికారిక పత్రాల్లో కాకుండా.. సాధారణ కాగితాలపై, చిన్న స్లిప్‌లపై పంపిస్తారు. ఇలా వచ్చిన సమాచారం చూసుకున్న తరువాత.. సదరు పైస్థాయి నేతలు, అధికారులు ఆ కాగితాన్ని లేదా.. సమాచారం వచ్చిన దానిని కాల్చిపారేస్తారని నిఘా వర్గాల్లో పనిచేసే నిపుణులు చెబుతున్నారు.
దీనివల్ల అటు ఎవరు ఆదేశించారనేది తెలియదు.. ఆ సమాచారం ఏమిటనేది కూడా మిగలదు. దీనితో ఇదంతా కేవలం డ్రామాగా మిగులుతుందని నిఘా వర్గాల నిపుణులు విశ్లేషి స్తున్నారు. ఇప్పుడు జరుగుతున్న సిట్ విచారణలో కూడా ఏ సమాచారం.. ఎవరి గురిం చి.. ఎప్పుడు కావాలని ఎవరు ఆదేశించారనేది తెలియదు. సీఎం నుంచి కిందిస్థాయి పోలీసు కానిస్టేబుల్ వరకు దీనిని ఎవరూ నిర్ధారించలేదు. అలాగే వచ్చిన సమాచారం ఏమిటనేది ఎక్కడా రికార్డులు ఉండవు. ఫైళ్లు అసలే ఉండవు. అంటే అది నిజమని చెప్పే ఒక్క సాక్ష్యం కూడా లేదనే చెప్పవచ్చు. కేసు ఇక కోర్టులో ఏం నిలుస్తుంది.? అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.
రెండు పక్షాల వద్ద సమాచారం
వాస్తవానికి ప్రభుత్వం గతంలో జరిగిన సంఘటనలకు, ఫోన్ ట్యాపింగ్‌పై సిట్ వేసి విచారణ చేయిస్తోంది. ఇప్పుడు విచారణలో ఏం తేలినా.. అప్పట్లో ప్రతిపక్ష నేతలు, ముఖ్యమైన ప్రజాప్రతినిధులు, ప్రత్యర్థులు ఏం చేశారనే సమాచారం కూడా ఇప్పుడు విచారణ ఎదుర్కొంటున్న వారికి తెలిసి ఉంటుందని.. అయితే బయటపెట్టలేని పరిస్థితుల్లో ఉండటంతో వాటికీ విలువ ఉండదని విశ్లేషకులు అంటున్నారు.
ఇప్పుడు విచారణ చేయిస్తున్న ప్రభుత్వానికి కూడా సమాచారం తెలిసినా.. ఏం చేయలేని పరిస్థితే ఉంటుందని.. వారంటున్నారు. ఇలా రెండు పక్షాలు కూడా కేవలం రాజకీయ డ్రామాను రసవత్తరంగా నడిపించడానికే విమర్శలు, ప్రతివిమర్శలు చేస్తుంటారని వారంటున్నారు.
ఒక్క అరెస్టు కూడా లేదు..
వాస్తవానికి తాజాగా బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు రాంచందర్‌రావు ఒకానొక సందర్భంలో మాట్లాడుతూ.. ఫోన్ ట్యాపింగ్‌పై సిట్ విచారణ అనేది ఉత్తిదేనని.. ఇప్పటి వరకు ఎందుకు ఒక్కరిని కూడా ఈ కేసులో అరెస్టు చేయలేదని విమర్శించడం గమనార్హం. అయితే విచారణలే తప్పితే.. అరెస్టులు ఉంటాయనే సూచనలు కూడా కనపడటం లేదు. అంటే ప్రతిపక్ష నేతలు చేస్తున్న విమర్శలు నిజమనే అనుమానాలు బలపడుతున్నాయి.
ఈ నేపథ్యంలో.. రికార్డులు, ఫైళ్లు లేని పరికరాలతో.. ఎవరు ఆదేశించారో అధికారికంగా ధ్రువీకరణలేని సంఘటనలో.. అసలు ఏం బయటకు వచ్చిందో సాక్ష్యం లేని సమాచారం కోసం జరుగుతున్న విచారణే సిట్ విచారణ.. అని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటాన్ని బట్టి, న్యాయస్థానంలో నిలబడలేదని.. ఇదొక పొలిటికల్ డ్రామా లాంటిదనే అనుమానం బలపడుతోంది..!
అక్కడే న్యాయ వివాదం..
అధికారికంగా ఎలాంటి రికార్డులు, ఫైళ్లు లేని పరికరాలను ఉపయోగించి.. ఫోన్ ట్యాపింగ్ చేయడం.. కేవలం అంతర్గతంగా సమాచారం కోసమేనని.. ఇవి న్యాయ పోరాటంలో నిలబడవని నిపుణులు కుండబద్దలు కొడుతున్నారు. అంటే అధికారికంగా ధ్రువీకరించలేని పరికరాలను ఉపయోగించి.. ఫలానా సమాచారం సేకరించినట్టుగా.. న్యాయస్థానంలో పోరాటం చేయలేని పరిస్థితి తలెత్తుతుందని వారు అంటున్నారు. అధికారికంగా రికార్డులు, ఫైళ్లు లేవు కనుక.. అది చట్టబద్ధం కాదు. చట్టబద్ధం కాదు కనుక.. న్యాయస్థానాల్లో నిలబడవని వారంటున్నారు.
కేసు కోర్టుకు వెళ్లినా.. సాక్ష్యాలేవీ?
కేవలం కేసులు నమోదు చేసి.. విచారణకు పిలిపించినంత మాత్రాన.. న్యాయ స్థానాల వరకు వెళ్లవని.. వెళ్లినా కేసులు నిలవవని న్యాయ నిపుణులు అంటున్నారు. అటు సాంకేతికాంశాలకు రికార్డులు, ఫైళ్లు ఉండవు. అధికారికంగా ఆదేశించినది ఎవ రూ ధ్రువీకరించరు. సమాచారం ఏమిటనేది ఏదీ సాక్ష్యం ఉండదు. ఇక కేసులు ఏం నిలుస్తాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే జరిగే తతంగం యావత్తూ.. పొలిటికల్ డ్రామాగా నిలిచిపోతుందని.. ఈ సిట్ విచారణ కూడా అలాంటిదేనంటూ నిపుణులు కొట్టిపారేస్తుండటం గమనార్హం.