25 March, 2026 | 3:26 AM

‘విదేశీ విద్య’ సాయం ఏదీ? X ‘విదేశీ విద్య’తో 2 వేల మందికి లబ్ధి

25-03-2026 01:30 AM

‘విదేశీ విద్య’ సాయం ఏదీ?

  1.   2,500 మంది విద్యార్థుల ఎదురుచూపు
  2. గత అక్టోబరులో 303 కోట్లు ప్రకటించి, ఇంకా ఎందుకు విడుదల చేయలేదు?
  3. గ్రీన్ ఛానల్‌లో విడుదల చేయాలి
  4. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్, మార్చి 24 (విజయక్రాంతి): ‘విదేశీ విద్యా పథకం’ కింద ఆర్థిక సహాయం కోసం దాదాపు 2,500 మంది విద్యార్థులు ఎదురుచూస్తున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. విదేశీ విద్యా పథకం కింద విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై మంగళవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో కేటీఆర్ మాట్లాడారు.

విదేశాల్లో ఉన్న విద్యార్థులు ఫస్ట్ సెమిస్టర్ ఫీజులు చెల్లించి, సెకండ్ సెమిస్టర్ ఫీజులు చెల్లించలేక ఇబ్బందులు పడుతూ తమకు సందేశాలు పంపుతున్నారని వెల్లడించారు. 2025 అక్టోబర్‌లో విదేశీ విద్యకు సంబంధించి రూ.303 కోట్లు విడుదల చేస్తున్నామని ప్రభుత్వం ప్రకటించిం దని, కానీ ఇప్పటివరకు ఆ నిధులు విడుదల కాలేదని విమర్శించారు.

బీఆర్‌ఎస్ హయాం లో ‘ఓవర్సీస్ విద్యా నిధి’ ద్వారా వేలాది దళిత, గిరిజన, వెనుకబడిన తరగతుల విద్యార్థులు విదేశాల్లో గౌరవప్రదంగా చదువుకున్నారని, సుమారు 7 వేల మంది విద్యా ర్థులకు ఒక్కొక్కరికి రూ.20 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించామని గుర్తు చేశా రు. ప్రస్తుతం అమెరికా, లండన్, జర్మనీ వం టి దేశాల్లో ఉన్న తెలంగాణ విద్యార్థులు అనే క కష్టాలు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాం లో విదేశీ విద్యా పథకం కింద వెళ్లామని, కానీ ఇప్పటివరకు డబ్బులు రాలేదని, దయచేసి అసెంబ్లీలో ఈ విషయం ప్రస్తావిం చాలని విద్యార్థులు విజ్ఞప్తి చేస్తున్న విషయా న్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ప్రభు త్వం, సీఎం ఈ అంశాన్ని అత్యంత ప్రాధాన్యతగా తీసుకుని, గ్రీన్ ఛానల్‌లో పెట్టి నిధు లను విడుదల చేయాలని కోరారు.

కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మౌలానా అబుల్ కలాం తాలీమ్- పథకం కూడా ఇప్పటివరకు అమలులోకి రాలేదన్నారు. 10వ తర గతి పాస్ అయితే రూ.10 వేలు, ఇంటర్ పా స్ అయితే రూ.15 వేలు, డిగ్రీ పాస్ అయితే రూ.25 వేలు ఇస్తామని చేసిన హామీలను కూడా గుర్తు చేశారు. 

‘విదేశీ విద్య’తో 2 వేల మందికి లబ్ధి

  1. ఇప్పటి వరకు 607 కోట్లు ఖర్చు చేశాం
  2. ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ  మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్

హైదరాబాద్, మార్చి 24 (విజయక్రాంతి): 2023 నుంచి ఇప్పటి వరకు అంబేద్కర్ ఓవర్సీస్ పథకం ద్వారా సుమారు 2 వేల మంది విద్యార్థులకు లబ్ధి చేకూర్చామని ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ వెల్లడించారు. గత రెండున్నరేళ్లలో 4,944 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ విద్యార్థులకు రూ.607 కోట్లను మంజూరు చేశామని తెలిపారు. ఇంకా 520 మంది ఎసీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు ఓవర్సీస్ స్కాలర్‌షిప్ మంజూరు చేయాల్సి ఉందని, చెల్లింపు ప్రాసెస్‌లో ఉందన్నారు.

మంగళవారం అసెంబ్లీలో కేటీఆర్, కూనంనేని సాంబశివరావు అడిగిన ప్రశ్నలకు మంత్రి అడ్లూరి సమాధానమిచ్చారు. విదేశీ విద్య ఉపకార వేతనాల పథకాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రారంభించిందని గుర్తు చేశారు. ప్రస్తుతం ప్రాసెస్‌లో ఉన్న 520 మంది విద్యార్థుల ప్రయోజనం కోసం రూ.53.26 కోట్లను కేటాయించినట్టు వెల్లడించారు. ప్రభుత్వం వీలైనంత త్వరగా విడుదల చేస్తుందన్నారు. విదేశాల్లో చదువుకునే వారికి ఈ పథకం కింద నిబంధనలకు అనుగుణంగా ప్రభుత్వమే ఫీజు చెల్లిస్తుందని చెప్పారు.