నటన నిజమైంది..!
భార్యను బెదిరిద్దామనుకుని ఉరేసుకున్నాడు..
కూర్చి కదలడంతో మెడకు బిగుసుకున్న ఉరితాడు.
మంగనూరులో యువకుడి మృతి.
బిజినేపల్లి: ఇంటికి తాగి వచ్చిన భర్తను మందలించగా ఆ భార్యను బెదిరించడం కోసం భర్త ఉరి వేసుకున్నట్లు చేసిన నటన నిజమైంది. ప్రమాదవశాత్తు కాళ్ళ కింద ఉన్న కూర్చి అదుపు తప్పడంతో ఉరితాడు మెడకు బిగుసుకుంది. దీంతో ఆ భర్త అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని మంగనూర్ గ్రామంలో మంగళవారం రాత్రి చోటు చేసుకోగా బుధవారం వెలుగు చూసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన సంగనమోని మల్లేష్(30) అనే వ్యక్తి మంగళవారం రాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చాడు. విషయం గమనించిన భార్య మల్లేష్ తో మద్యం ఎందుకు తాగుతున్నావ్ అంటూ మందలించింది.
దీంతో మల్లేష్ తన భార్యతో వాగ్వాదం పెట్టుకుని చస్తాను చూడు అంటూ ఇంట్లోకి వెళ్ళి ఫ్యానుకు తాడు కట్టి కూర్చి వేసుకొని నిలబడ్డాడు. బయటి నుండి కుటుంబ సభ్యులు పిలవడంతో మెడకు ఉన్న ఉరితాడు విప్పుకోబోయాడు. ప్రమాదశావత్తు కాళ్ళ కింద ఉన్న కూర్చి అదుపు తప్పింది. దీంతో ఉరితాడు మెడకు బిగుసుకుంది. బయటికి రావడం లేదని కుటుంబ సభ్యులు వెళ్లి చూసే సరికి మల్లేష్ కొన ప్రాణంతో అక్కడిక్కడే చనిపోయాడు. కుటుంబ సభ్యులు బోరున విలపించారు. ఈ విషయమై ఎస్సై శంషుద్దీన్ వివరణ కోరగా తమకు ఎలాంటి పిర్యాదు అందలేదని, విషయం తమ దృష్టికే రాలేదన్నారు. మృత్యుడికి భార్య ఇద్దరు కూతుళ్లు ఒక బాబు ఉన్నాడు.






