గ్యాస్ కష్టాలు తీరేదెన్నడో!
ఏజెన్సీ ముందు ఖాళీ సిలిండర్లతో క్యూలైన్లు
అక్రమంగా సిలిండర్లు అమ్ముకుంటున్నారని వినియోగదారుల ఆందోళన
గ్యాస్ ఏజెన్సీ నిర్లక్ష్యంపై అసహనం
ఇబ్బందులు లేకుండా సరఫరా చేయాలని వేడుకోలు
సంస్థాన్ నారాయణపూర్, మార్చి 25: రాష్ట్రంలో గ్యాస్ కొరత లేదంటూ ప్రభుత్వ అధికారులు చెబుతున్నప్పటికీ క్షేత్ర స్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. గ్యాస్ ఏజెన్సీల వద్ద క్యూలైన్లలో జనాలు ఖాళీ సిలిండర్లతో బారులు తీరి ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం బుకింగ్ కోసం విధించిన నిబంధనలతో ఒకవైపు, ఏజెన్సీల నిర్లక్ష్యంతో మరోవైపు ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
మండలంలో ఇధీ పరిస్థితి : సంస్థాన్ నారాయణపురం మండలంలో భారత్ గ్యాస్ వినియోగదారులు 8వేలకు పైగా ఉండగా, ఇండెన్, హెచ్పీ గ్యాస్ వినియోగదారులు 30 వేలకు పైగా ఉన్నారు. నారాయణపురం లోని భారత్ గ్యాస్ లక్ష్మీనరసింహ ఏజెన్సీ వద్ద బుధవారం తెల్లవారకముందే సిలిండర్లను లైన్లలో పెట్టి నిల్చున్నారు. నాలుగు రోజులుగా గ్యాస్ సిలిండర్ల ఎదురుచూస్తున్న మండల ప్రజలు బుధవారం ఒక్కసారిగా వందల సంఖ్యలో ఏజెన్సీ వద్దకు చేరుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది.
ఉదయం నుండి ఎదురుచూస్తున్నా తమ పేరు రావడంలేదంటూ నిర్వాహకులపై అసహనం వ్యక్తం చేశారు. గతంలో ఎప్పుడూ ఇంత కొరత లేదని మొదటిసారిగా ఇంత ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికా, ఇజ్రాయెల్ _ ఇరాన్ యుద్ధం ముగియకపోవడంతో రాబోయే రోజుల్లో గ్యాస్ కొరత మరింత పెరుగుతుందన్న ప్రచారం ప్రజల్లో తీవ్రంగా జరగడంతో ఒక్కసారిగా ప్రజలలో ఆందోళన మొదలైనది. గ్యాస్ రాక కట్టెలతో వంట : గ్యాస్ కష్టాలతో హోటళ్లు, చిరువ్యాపారులు,స్కూళ్లు,హాస్టళ్లలో కట్టెలతో వంట చేయాల్సిన పరిస్థితి నెలకొంది.
హోటళ్లలో కట్టెలతో వంట చేయాలంటె ఇబ్బందులు ఎదుర్కుంటున్నామని హోటల్ నిర్వాహకులు చెబుతున్నారు. గ్యాస్ మీద వండిన వంటకు అలవాటు పడిన కట్టెలతో వండిన టిఫిన్,భోజనాలకు ఇష్టపడడం లేదని చెబుతున్నారు. గతంతో సిలిండర్లు కొరత ఇంతగా ఎప్పుడూ లేదని ఇప్పుడు 45 రోజుల తర్వాతనే బుక్ చేసుకోవాలంటే వ్యాపారం నడవడం కష్టంగా ఉందంటూ వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు గ్యాస్ సరఫరా పై దృష్టి పెట్టి ఎక్కడా ఏ విధమైన ఇబ్బందులు లేకుండా చూడాలని వినియోగదారులు కోరుతున్నారు.
గ్యాస్ కొరతపై అనవసర ఆందోళన వద్దు
గ్యాస్ సిలిండర్ల సరఫరాలో ఎలాంటి ఇబ్బంది లేదు. గతంలో ఒక్కరోజులోనే బుకింగ్ అయిపోయేది. ఇప్పుడు రెండు రోజులు సమయం పట్టడంతో కొద్దిగా ఆలస్యం అవ్వడంతో కొంత ఆందోళన వినియోగదారుల్లో మొదలైంది. గతంలో మాదిరిగానే ఇప్పుడు కూడా సిలిండర్లు రెగ్యులర్ గా వస్తున్నాయి. సిలిండర్ దొరుకుతుందో లేదోనన్న భయం అవసరం లేదు.
సంజీవ, గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకుడు
అక్రమంగా సిలిండర్లు అమ్ముకుంటున్నారు:
ఉదయం ఏడు గంటల నుండి గ్యాస్ ఆఫీసు దగ్గర లైన్లో నిలబడ్డాం. సాయంత్రం నాలుగు గంటల వరకు ఇంకా మీ పేరు రాలేదని చెబుతున్నారు.నాలుగు రోజులుగా సిలిండర్ల కోసం ఎదురుచూస్తున్నాం.అక్రమంగా అమ్ముకుంటున్నందునే మాకు సిలిండర్లు దొరకడం లేదు‘.
పాల యాదయ్య, కంకణాలగూడెం గ్రామస్తుడు




