16 June, 2026 | 1:19 AM

శ్రీలంక ఏ సూపర్ విజయం

16-06-2026 12:06 AM

భారత్‌కు మరో ఓటమి

ముక్కోణలు సిరీస్‌లో భారత్ ఏ, శ్రీలంక ఏ మధ్య మ్యాచ్ ఉత్కంఠ రేపింది. రెండు జట్లు సరిగ్గా265 పరుగులే చేయడంతో మ్యాచ్ టైగా ముగిసింది. వెలుతురు లేదని అంపైర్లు సూపర్ ఓవర్‌కు నిరాకరించగా.. భారత్ ఏ కెప్టెన్ తిలక్ వర్మ పట్టుబట్టడంతో ఫలితం కోసం సూపర్ ఓవర్ నిర్వహించారు. అయితే సూపర్ ఓవర్లో లంక ఏ జట్టుదే పైచేయిగా నిలిచింది. అయితే మ్యాచ్ అనంతరం వైభవ్ సూర్యవంశీతో లంక ఆటగాళ్ల వాగ్వాదం, అంపైర్లతో తిలక్ వర్మ వాగ్వాదం ఈ మ్యాచ్‌ను వేడెక్కించాయి. 

దంబుల్లా, జూన్ 15: శ్రీలంక వేదికగా జరుగుతున్న ఏ జట్ల ట్రై సిరీస్‌లో భారత్‌కు మరో ఓటమి ఎదురైంది. చివరి వరకూ ఉ త్కంఠగా సాగిన పోరులో విజయం ఇరు జట్లతో దోబూచులాడగా.. చివరకు శ్రీలంక ఏ జట్టు సూపర్ ఓవర్లో గెలిచింది. ఈ మ్యా చ్‌లో మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ ఏ 39 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. వైభవ్ సూర్యవంశీ (21), ప్రభ్ సిమ్రన్ సింగ్ (11) నిరాశపరిచారు. తర్వాత తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్ హాఫ్ సెంచరీ పార్టనర్ షిప్ తో ఆదుకున్నారు.

తిలక్ వర్మ 23, రుతురాజ్ 37 పరుగులకు ఔటవగా.. ఇక్కడ నుంచి భారత్ మరో 3 వికెట్లు చేజార్చుకుంది. ఈ దశలో సూర్యాంశ్ షెగ్దే, నిప్ర జ్ నిగమ్ అద్భుతమైన పార్టనర్ షిప్‌తో ఆదుకున్నారు. వీరిద్దరూ 8వ వికెట్‌కు 104 పరుగులు జోడించారు. సూర్యాంశ్ 66 బం తుల్లో 72 (3 ఫోర్లు, 2 సిక్సర్లు), విప్రజ్ 49 బంతుల్లో 51 ( 6 ఫోర్లు) పరుగులు చేశారు. దీంతో భారత్ ఏ 49.2 ఓవర్లలో 265 పరుగులకు ఆలౌటైంది. భారత బ్యాటర్లు పిచ్‌పై పరిగెత్తడంతో అంపైర్లు 10 పరుగులు పెనాల్టీగా విధించారు. దీంతో ఒక బంతి కూడా పడకుండానే శ్రీలంకకు 10/0 పరుగులు వచ్చాయి.

ఓపెనర్లు శ్రీలంక ఏ జట్టుకు మం చి ఆరంభాన్నే ఇచ్చారు. ఆ తర్వాత లంక ఏ జట్టు వరుసగా వికెట్లు కోల్పోయింది. వికెట్లు పడినా సదీరా సమరవిక్రమా ఒంటరిగా పో రాడాడు. శ్రీలంక విజయానికి చివరి 6 బం తుల్లో 5 పరుగులు కావాల్సిన సమయంలో 8వ వికెట్‌గా సమరవిక్రమా ఔటవడంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది.  తర్వాతి నా లుగు బంతుల్లో భారత్ ఏ జట్టు 4 పరుగులే ఇవ్వడంతో మ్యాచ్ టై అయింది. తర్వాత సూపర్ ఓవర్లో శ్రీలంక విజయాన్ని అందుకుంది.  లంక ఏ జట్టు 16 పరుగులు చేయ గా.. భారత్ ఏ 9 పరుగులే చేయగలిగింది.

అంపైర్లతో తిలక్‌వర్మ వాగ్వాదం

ఈ మ్యాచ్ చివర్లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అం పైర్ల తీరుపై తిలక్‌వర్మ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. లంక ఏ ఇన్నింగ్స్ చివ ర్లో ఆఖరి బంతిని ఎదుర్కొన్న గుణశేఖర బాల్‌ను ఫ్లిక్ చేయకుండానే.. సింగిల్ తీసి రనౌట్ అయ్యాడు. దీంతో స్కోరు సమం కాగా.. తొలి పరుగును ఎలా లెక్కలోకి తీసుకుంటారని వాదించినట్లు కనిపించింది. ఫలితం కోసం సూపర్ ఓవర్ నిర్వహించాల్సి ఉండగా వెలుతురులేమితో అంపైర్లు నిరాకరించారు. ఈ నేపథ్యంలో కెప్టెన్ తిలక్ వర్మ అంపైర్లతో వాగ్వాదానికి దిగాడు. సూపర్ ఓవర్ నిర్వహించాల్సిందేనని పట్టుబట్టాడు. ఇక సూపర్ ఓవర్లో ఐదో బంతిని నోబాల్ ఇవ్వడంపైనా అంపైర్లతో తిలక్ వర్మ వాదనకు దిగాడు.

లంక క్రికెటర్లతో వైభవ్ డిష్యూం డిష్యూం

చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ ఆగ్రహంతో ఊ గిపోయాడు. లంక ఏ ఆటగాళ్లు నోరుపారేసుకోవడం తో వారి పైకి దూసుకెళ్లాడు. సూపర్ ఓవర్లో భారత్ 9 పరుగులే చేసి ఓటమిపాలైంది. వైభవ్, సూ ర్యాంశ్ వెళుతుండగా లంక క్రికెటర్లు ఏదో అన్నారు. దీంతో సహనం కోల్పోయిన వైభవ్ సూర్యవంశీ అతనిపై చేయి వేసి వెన క్కి నెట్టేశాడు. లంక ప్లేయర్లు కూడా పైపైకి రావడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ దశలో లంక వికెట్ కీపర్ డిక్‌వెల్లా వారిని శాంతింపజేశాడు. తర్వాత పెవిలియన్‌కు వెళుతూ వైభవ్ లంక క్రికెటర్ల వైపు చేయి చూపిస్తూ ఫైర్ అయ్యాడు.