పేదల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం
ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక అమలు పై సన్నాహక సమావేశం
పాల్గొన్న నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం
జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్
చిట్యాల,(విజయక్రాంతి): పేదల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ప్రజలకు ఎదురయ్యే ప్రతి సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు. నకిరేకల్ పట్టణంలోని నారాయణ రెడ్డి ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన నకిరేకల్ నియోజకవర్గ స్థాయి ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక అమలుపై సన్నాహక సమావేశం కార్యక్రమంలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం గత రెండేళ్లలో ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు మరింత సమర్థంగా చేరవేయడానికి 99 రోజుల “ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక” కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం ఏర్పడిందని, పేదల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సన్నబియ్యం, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వంటి పలు సంక్షేమ పథకాలను అందిస్తున్నదని వివరించారు. ఈ 99 రోజుల కార్యక్రమంలో ప్రతి శాఖకు ప్రత్యేకంగా రోజులు కేటాయించి ప్రజా సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సాధించాలన్నదే ముఖ్యమంత్రి లక్ష్యమని అన్నారు. సంకల్పంతో పని చేస్తే ప్రతి కార్యక్రమం విజయవంతమవుతుందని, అధికారులు మరియు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని సూచించారు.
నకిరేకల్ నియోజకవర్గంలో గంజాయి సమస్య ఎక్కువగా ఉండేదని, ఇప్పటికే చాలా వరకు కట్టడి చేశామని తెలిపారు. యువత తప్పుదారిలో పడకుండా అందరూ కలిసి చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజలకు ఎదురయ్యే ప్రతి సమస్యను పరిష్కరించేందుకు కట్టుబడి ఉన్నామని అన్నారు. ఇక అభివృద్ధి కార్యక్రమాల విషయానికి వస్తే, నకిరేకల్ పట్టణంలో 100 పడకల ఆసుపత్రిని త్వరలో ప్రారంభించనున్నామని, అలాగే చిట్యాల పట్టణంలో 30 పడకల ఆసుపత్రి, రామన్నపేటలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణం చేపడతామని వెల్లడించారు.
రేషన్ కార్డు రాని వారు తిరిగి దరఖాస్తు చేసుకుంటే అర్హులైన వారికి తప్పకుండా కార్డులు మంజూరు చేస్తామని తెలిపారు. అలాగే ఇందిరమ్మ ఇళ్ల రెండో విడతలో అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇండ్లు కేటాయిస్తామని అన్నారు. నకిరేకల్ పట్టణ భద్రత దృష్ట్యా తన నిధుల నుంచి సీసీ కెమెరాల ఏర్పాటు కోసం రూ.30 లక్షలు కేటాయిస్తున్నట్లు ఎమ్మెల్యే ప్రకటించారు.




