బెంగాల్ ఎన్నికల నిర్వహణపై మమతా బెనర్జీ ఘాటు విమర్శలు
- వంద సీట్లలో మా గెలుపును దొంగిలించారు.
- మేం ఓడిపోలేదు..
- బెంగాల్ ఎన్నికల తీరుపై మమత అసంతృప్తి
- బెంగాల్ లో వంద సీట్లలో ఓట్ చోరీ
కోల్‌కతా: బెంగాల్ ఎన్నికల నిర్వహణపై ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బెంగాల్లో ఎన్నికల తీరుపై మమతా బెనర్జీ అసంతృప్తి వ్యక్తం చేశారు. బెంగాల్ లోని వంద సీట్లలో తమ గెలుపును దొంగిలించారని ఆరోపించారు. మేం ఓడిపోలేదు.. మా గెలుపును దొంగలించారు. అధికారం లేకపోయినా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఇంత దారుణంగా నిర్వహించిన ఎన్నికలను ఎప్పుడూ చూడలేదని మమత ఆగ్రహం వ్యక్తం చేశారు. బెంగాల్ పోలీసులు అచేతనంగా ఉండిపోయారని మండిపడ్డారు. కేంద్రబలగాలు ఈసీతో కుమ్మక్కయాయని సంచలన ఆరోపణలు చేశారు. ఎన్నికల ఫలితాల కౌంటింగ్ కేంద్రాల్లో టీఎంసీ అభ్యర్థులను భయాభ్రాంతులకు గురిచేశారని తెలిపారు. మహిళనైన తనతోనే అనుచితంగా ప్రవర్తించారని సూచించారు.
బెంగాల్లో బీజేపీతో కాదు.. ఈసీతో పోరాడాం : మమతా బెనర్జీ
బెంగాల్ లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని మమత ఆరోపించారు. ఈసీపై ఎలా పోరాడాలో పార్టీలో చర్చించి.. ముందుకెళ్తామని సూచించారు. మా పార్టీ కార్యాలయాలపైనా దాడులు చేస్తున్నారని మమతా బెనర్జీ ధ్వజమెత్తారు. ఎన్నికల నిర్వహణలో ఈసీ పక్షపాతంగా వ్యవహరించిందన్నారు. కేంద్రం నియంత్రణలో ఎన్నికల సంఘం పనిచేసిందని విమర్శించారు. బెంగాల్లో మేం బీజేపీతో కాదు.. ఈసీతో పోరాడామని స్పష్టం చేశారు. సోనియా జీ, రాహుల్ గాంధీ, అరవింద్ కేజ్రీవాల్, ఉద్ధవ్ ఠాక్రే, అఖిలేష్ యాదవ్, తేజస్వి యాదవ్, హేమంత్ సోరెన్ తనతో ఫోన్ లో మాట్లాడారని మమతా బెనర్జీ సూచించారు. ఇండియా కూటమిని బలోపేతం చేస్తామన్నారు. 'INDIA' కూటమిలోని మిత్రపక్షాలన్నీ తాము పూర్తిగా, సంపూర్ణంగా తన వెంటే ఉన్నామని తెలిపారు. ఎన్నికల అనంతరం హింస పరిశీలనకు 10 మందితో కమిటీ వేశామన్నారు. మొత్తం పశ్చిమ బెంగాల్ లో 294 అసెంబ్లీ స్థానాల్లో BJP (207), AITC(80), INC(2), AJUP(2), CPI(M) 1, AISF(1) స్థానాల్లో విజయం సాధించాయి. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో భవానీపుర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన మమతా బెనర్జీ ఓటమి పాలయ్యారు. అటు తమిళనాడులోని సీఎం ఎంకే స్టాలిన్ చిత్తుగా ఓడిపోయారు.






