చిట్యాల మార్కెట్ కమిటీలో స్వాగత–వీడ్కోలు కార్యక్రమం
చిట్యాల,(విజయక్రాంతి): చిట్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీలో మంగళవారం స్వాగత–వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు. మార్కెట్ కమిటీ కార్యదర్శి గ్రేడ్-2గా పనిచేస్తున్న ఆర్. జానయ్య బదిలీపై చండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీకి వెళ్లగా, జె. సత్యనారాయణ నూతన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ నర్ర వినోద మోహన్ రెడ్డి అధ్యక్షత వహించగా, చిట్యాల మున్సిపల్ చైర్‌పర్సన్ పందిరి గీత రమేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
వారు మాట్లాడుతూ... జానయ్య చిట్యాల మార్కెట్ కమిటీలో అందించిన సేవలను అభినందించి, భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. అలాగే నూతన కార్యదర్శి సత్యనారాయణకి శుభాకాంక్షలు తెలియజేస్తూ రైతులు, వ్యాపారులకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. నూతన కార్యదర్శి జె. సత్యనారాయణ మాట్లాడుతూ రైతుల సంక్షేమం, మార్కెట్ నిర్వహణలో పారదర్శకత, రైతులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు కృషి చేస్తానని తెలిపారు.
బదిలీపై వెళ్తున్న ఆర్. జానయ్య ని శాలువాతో సన్మానించి జ్ఞాపికను అందజేయగా, నూతన కార్యదర్శి జె. సత్యనారాయణ కి పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్, సభ్యులు, సిబ్బంది, హమాలీలు, రైతు ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.






