11 June, 2026 | 3:18 AM

అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తాం

11-06-2026 02:14 AM

కలెక్టర్ కె.హరిత

కుమ్రం భీం ఆసిఫాబాద్, జూన్ 10 (విజయక్రాంతి): ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాల ఫలాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అం దేలా కృషి చేస్తున్నామని జిల్లా కలెక్టర్ కె.హరిత తెలిపారు. బుధవారం కాగజ్నగర్ పట్టణంలోని 27వ వార్డులో పుర పాలక సంఘం ఆధ్వర్యంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా నిర్వహించిన వార్డు సభకు మున్సిపల్ కమిషనర్ తిరుపతి, చైర్పర్సన్ షహీన్ సుల్తానాతో కలిసి కలెక్టర్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పేద ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు. ప్లాస్టిక్ సంచులు, బాటిళ్లను చెత్తకుండీలలో మాత్రమే వేయాలని తెలిపారు.వర్షాకాలంలో చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలు మురికి కాలువల్లో పేరుకుపోవడం వల్ల నీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడి ఇండ్లలోకి నీరు చేరే పరిస్థితులు వస్తాయని పేర్కొన్నారు.

ఈ సమస్యల నివారణకు అధికారులు తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి సంరక్షించాలని, ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల్లో ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని కోరారు.అనంతరం పురపాలక సంఘం చైర్మన్, కౌన్సిలర్లతో కలిసి రెండు పడక గదుల ఇండ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్ పత్రాలను అందజేశారు.ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు, లబ్ధిదారులు, ప్రజలు పాల్గొన్నారు.