21 April, 2026 | 8:24 AM

విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించం

21-04-2026 12:00 AM

కొందుర్గు పీహెచ్‌సీలో తనిఖీలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆగ్రహం

షాద్‌నగర్, ఏప్రిల్ 20(విజయక్రాంతి): కొందుర్గు మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రి నిర్వహణ తీరుపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. హాజరు రిజిస్టర్లో 19 మంది సిబ్బంది ఉన్నట్లు ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో కేవలం 5 మంది మాత్రమే విధుల్లో ఉండటంపై ఎమ్మెల్యే మండిపడ్డారు. పరస్పర అవగాహనతో విధులకు ఎగ్గొట్టడం సరికాదని డాక్టర్లను హెచ్చరించారు.

ఇక్కడ జీతం తీసుకుంటూ మరోచోట సేవలందించే డిప్యూటేషన్ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని ఆదేశించారు. రోగుల రికార్డులను పరిశీలించగా, రోజుకు కేవలం 25-30 మంది మాత్రమే రావడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రభుత్వ సౌకర్యాలు ఉన్నా ఓపీ ఎందుకు తగ్గిందని ప్రశ్నించారు.

ఎమ్మెల్యే అక్కడి నుండే జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి  లలితతో ఫోన్లో మాట్లాడారు. రెండు రోజుల్లో సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని, విధుల్లో నిర్లక్ష్యం వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో స్థానిక నేతలు మరియు అధికారులు పాల్గొన్నారు.